- గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాల్లో కనిపించని కనీస వసతులు
- గుంతల రోడ్లు, అసంపూర్తి డ్రైనేజీలతో ప్రజల ఇబ్బందులు
- శ్మశానవాటికలు లేక చెరువు గట్ల మీదే దహన సంస్కారాలు
హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన గ్రామాల్లో హడావుడిగా ట్యాక్సులు పెంచిన ప్రభుత్వం అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర కనీస వసతులు సైతం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్‌లో రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొత్త హామీలు, శిలాఫలకాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గుంతల రోడ్లు... కనిపించని శ్మశానవాటికలు
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 42 విలీన గ్రామాల్లో ఎక్కడా సరైన శ్మశానవాటికలు లేవు. ఉపాధి హామీ పథకం అమలయ్యే గ్రామాల్లో కేంద్రం రూ.10 లక్షలతో వైకుంఠధామాలను నిర్మిస్తుండగా ఈ గ్రామాలు గ్రేటర్‌లో కలవడంతో ఆ భాగ్యం కూడా లేకుండా పోయింది. హసన్‌పర్తి మండల కేంద్రంలో శ్మశాన వాటిక కోసం అక్కడి ప్రజలు సుమారు పదేళ్లుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా లీడర్లు మాత్రం పట్టించుకోలేదు. దీంతో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ల్యాండ్ కొనుక్కొని శ్మశానవాటికలు ఏర్పాటు చేసుకున్నారు. ఏనుమాముల ఎన్‌టీఆర్ నగర్‌లో శ్మశానవాటిక లేకపోవడంతో ఇటీవల ఓ మహిళ దహన సంస్కారాలను సమీపంలోని చెరువు వద్దే పూర్తి చేశారు.
ALSO READ: మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరిన ముఖ్య నేతలు
నాలుగైదు రోజుల తర్వాత ఆ స్థలాన్ని మున్సిపల్ సిబ్బంది చదును చేయడంతో అస్థికలు దొరకక కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. విలీన గ్రామాల్లో చాలా చోట్ల చెరువు గట్లు, రోడ్ల పక్కనే దహన సంస్కారాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే డ్రైనేజీలు, ఇంటర్నల్ సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుడా, జీడబ్ల్యూఎంసీ ఫండ్స్‌తో ప్రైవేట్ వెంచర్లకు ఉపయోగపడేలా రోడ్లు వేస్తున్న లీడర్లు... అదే మార్గంలోని గ్రామాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎలక్షన్స్ వస్తున్నాయని ఉరుకులు, పరుగులు
ఇప్పటివరకు విలీన గ్రామాలను పట్టించుకోని లీడర్లు ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. 2021 ఏప్రిల్‌లో గ్రేటర్ ఎలక్షన్స్‌కు ముందు లీడర్లు పెద్దఎత్తున శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఆ పనులు ఇప్పటివరకు పూర్తికాలేదు. శిలాఫలకం వేసిన లీడర్లు ఆ తర్వాత పట్టించుకోకపోవడం, గ్రేటర్‌లో బడ్జెట్ లేకపోవడం వల్ల పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో జనాల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టుకునేందుకు లీడర్లు మళ్లీ శిలాఫలకాల హడావుడి మొదలుపెట్టారు. ఒకే రోజు కోట్లాది రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కుల, యువజన సంఘాలతో మీటింగ్‌లు నిర్వహిస్తూ ఎడాపెడా హామీలు ఇస్తున్నారు. దీంతో ఓట్ల కోసం శిలాఫలకాలు వేయడం కాకుండా ప్రణాళిక ప్రకారం విలీన గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రెండింతలైన ట్యాక్స్
వరంగల్ నగరం 1844 నుంచే మున్సిపాలిటీగా కొనసాగగా 1994లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. ఆ తర్వాత 2015 జనవరిలో నగరానికి చుట్టుపక్కల ఉన్న 42 గ్రామాలను కలుపుతూ 66 డివిజన్లతో ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రకటించింది. ఇందులో వర్ధన్నపేట నియోజకవర్గంలో 30, పరకాలలో 10, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని 2 గ్రామాలు వరంగల్‌లో కలిశాయి. ఆయా గ్రామాలు గ్రేటర్‌లో విలీనం కావడంతో ట్యాక్సులు రెండింతలు పెరగడమే కాకుండా ఉపాధి హామీ వంటి పథకాలు అమలు కాకుండా పోయాయి. ట్యాక్సుల పెంపులో ఉన్న శ్రద్ధ వసతుల కల్పనలో లేకపోవడంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.