- వరంగల్‌లో మెయిన్ రోడ్ల వెంట కనిపించని డ్రైనేజీలు
- ఉన్న వాటిపై స్లాబ్‌లు వేసి, మెట్లు కట్టి ఆక్రమించిన వ్యాపారులు
- వరద ప్రవాహానికి అడ్డంకులు
హనుమకొండ, వెలుగు : వరంగల్ నగరంలో రోడ్ల వెంట డ్రైనేజీలు లేకపోవడం, కొన్ని చోట్ల ఉన్నా వాటిని కొందరు వ్యక్తులు ఆక్రమించడం, కాల్వలపై వ్యాపారులు స్లాబ్‌లు వేయడంతో వరద ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతోంది. దీంతో చిన్న వాన పడినా నగరంలోని ప్రధాన రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి. ప్రధానంగా ట్రై సిటీ పరిధిలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లో మెయిన్ రోడ్డు వెంట డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు.
అలాగే హనుమకొండ కలెక్టరేట్ నుంచి మొదలుకొని హనుమకొండ చౌరస్తా, బస్టాండ్, కాకాజీ కాలనీ, అలంకార్, ములుగు రోడ్డు, పోచమ్మ మైదాన్, మండి బజార్, వరంగల్ చౌరస్తా, హనుమకొండ తిరుమల జంక్షన్‌తో పాటు కుడా అపార్ట్‌మెంట్స్ వద్ద డ్రైనేజీలు, నాలాలపై వ్యాపారులు స్లాబ్‌లు వేసి మెట్లు నిర్మించుకున్నారు. దీంతో వర్షం పడినప్పుడు వరద ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుండడంతో జంక్షన్లతో పాటు మెయిన్ రోడ్లపై భారీగా నీరు నిలుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరద ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న నిర్మాణాలు, స్లాబ్‌లను తొలగించాల్సిన మున్సిపల్ ఆఫీసర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేండ్ల కిందట వచ్చిన వరదలకు నగరం అతలాకుతలం అయింది. దీంతో అప్పుడు నామమాత్రంగా స్లాబ్‌లు కూల్చివేసిన ఆఫీసర్లు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.