పడిపోయిన కార్ల అమ్మకాలు.. రోడ్డెక్కని 6 లక్షల కార్లు...

పడిపోయిన కార్ల అమ్మకాలు.. రోడ్డెక్కని 6 లక్షల కార్లు...

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సుమారు 6.5 లక్షల కార్లు అమ్మకం జరగక గోడౌన్లకే పరిమితమయ్యాయని తెలుస్తోంది. ఒక్కో కారు సగటున రూ. 9.5లక్షల రూపాయలు కాగా, 60వేల కోట్ల రూపాయల విలువ చేసే కార్లు డీలర్ల దగ్గరే మూలుగుతున్నాయని సమాచారం. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు కార్ల అమ్మకాలు పడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రుణ సదుపాయం తగ్గటం, ఆర్థిక మాంద్యం వంటి చాలా అంశాలు కార్ల అమ్మకాలు తగ్గటానికి కారణంగా చెప్పచ్చు. గత రెండు నెలల సమయంలోనే సుమారు 77వేల కార్లు అమ్మకానికి నోచుకోలేదని తెలుస్తోంది. ఇక మే నెలలో అయితే, ఏకంగా 4లక్షల కార్లు గోడౌన్లకే పరిమితమయ్యాయని తెలుస్తోంది.

ఈ ఏడాది విపరీతంగా పెరిగిన ఎండలు కూడా కార్ల అమ్మకాలు తగ్గటానికి కారణమై ఉండచ్చని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్ల షోరూమ్స్ కి వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గిందని అంటున్నారు.అంతే కాకుండా, సార్వత్రిక ఎన్నికలు, ఆలస్యమైన రుతుపవనాలు కూడా కార్ల అమ్మకాలు పడిపోవడానికి కారణమని చెప్పచ్చు.