హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా...

హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా...
  • 2018 నుంచి ఢిల్లీకి ఆడుతున్న షా
  • ఈసారి పట్టించుకోని ఫ్రాంచైజీలు
  • మూడేండ్లుగా నేషనల్ టీమ్‌‌‌‌కు కూడా దూరం

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌) : రెండు రోజుల ఐపీఎల్‌‌‌‌ వేలంలో  చాలా మంది స్టార్ క్రికెటర్లపై కోట్ల వర్షం కురిసింది. పలువురు అనామక ఆటగాళ్ల పంట పండింది.  బీహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 13 ఏండ్లకే ఐపీఎల్‌‌‌‌లో ఆడే చాన్స్ దక్కించుకున్నాడు. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతను కోటి పది లక్షలు పలికాడు. కానీ, ఇండియా క్రికెట్‌‌‌‌లో తన రాకను ఘనంగా చాటుకొని ఇంటర్నేషనల్ లెవెల్‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌లోనూ మెరుపులు మెరిపించిన 25 ఏండ్ల పృథ్వీ షాను మాత్రం ఏ ఒక్క ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. టన్నుల కొద్దీ టాలెంట్‌‌‌‌ ఉన్నా.. దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేక టీమిండియాకు దూరమైన షా ఇప్పుడు ఐపీఎల్‌‌‌‌ చాన్స్‌‌‌‌ కూడా కోల్పోయాడు.  2018లో ఐపీఎల్‌‌‌‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌కు ఆడుతున్న పృథ్వీ పవర్‌‌‌‌‌‌‌‌ప్లే స్పెషలిస్ట్‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు.  లీగ్‌‌‌‌లో 79 మ్యాచ్‌‌‌‌లు ఆడి 14 ఫిఫ్టీలు సహా 1892 రన్స్ చేశాడు. తొలి ఓవర్లోనే ఆరు బాల్స్‌‌‌‌లో ఆరు ఫోర్లు కొట్టిన రికార్డు కూడా తన పేరిట ఉన్నా వేలంలో డీసీ పట్టించుకోలేదు. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపలేదు. రెండుసార్లు వేలంలో అతని పేరు వినిపించినా.. ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో ఆరేండ్ల కిందట అండర్‌‌‌‌‌‌‌‌ 19 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన కెప్టెన్‌‌‌‌గా ప్రశంసలు అందుకొని ఇండియా క్రికెట్‌‌‌‌లో  సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని అనుకున్న పృథ్వీ  కెరీర్‌‌‌‌‌‌‌‌ అత్యల్ప స్థాయికి చేరుకుంది. 

 మరో కాంబ్లీ అవుతాడా? 

సాధారణంగా టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో సత్తా చాటి తిరిగి వస్తుంటారు. అయితే,  రంజీలతో పాటు కౌంటీ క్రికెట్‌‌‌‌లో  అప్పుడప్పుడు మెరిసినా షా నేషనల్ టీమ్‌‌‌‌లోకి తిరిగి రాలేకపోవడానికి కారణం అతని క్రమశిక్షణ లేకపోవడమే. చిన్న వయసులోనే వచ్చిన స్టార్‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌ అతనిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒకప్పుడు ఇరుకు గదిలో ఉండి, లోకల్ ట్రెయిన్‌‌‌‌లో నిల్చొని ప్రయాణించి వచ్చి  గ్రౌండ్‌‌‌‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్‌‌‌‌ చేసిన షా.. తాను సెలబ్రిటీ అయిన తర్వాత గాడి తప్పాడు. పబ్బులు, అమ్మాయిలు అంటూ పక్కదారి పట్టి క్రికెట్‌‌‌‌ను నిర్లక్ష్యం చేశాడు. కనీసం తన శరీరంపై కూడా శ్రద్ధ చూపలేక బరువు పెరిగిన షా ఫిట్‌‌‌‌నెస్  కూడా కోల్పోయాడు. దాంతో కొన్ని రోజుల కిందట ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అతడిని రంజీ జట్టు నుంచి కూడా తప్పించింది. నిజానికి గత ఐపీఎల్‌‌‌‌ సీజన్లలో షా తీరుపై ఢిల్లీ జట్టు తీవ్ర అసంతృప్తితో ఉంది. 

ఆ టీమ్‌‌‌‌తో పని చేసిన లెజెండరీ క్రికెటర్లు రికీ పాంటింగ్‌‌‌‌, సౌరవ్ గంగూలీ మాటలను కూడా పృథ్వీ పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి.  ‘పృథ్వీని తప్పించాలని మ్యాచ్ ముందు అనుకునేవాళ్లం. కానీ, గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చాక మా మనసు మారేది. ఇంకో అవకాశం ఇస్తే తన ప్రతిభకు న్యాయం చేస్తాడని అనుకునే వాళ్లం’ అని డీసీ మాజీ ఫీల్డింగ్ కోచ్ మహ్మద్‌‌‌‌ కైఫ్ చెప్పాడు. పృథ్వీని మంచి క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు తనతో ఎన్నో సార్లు మాట్లాడామని, తమ మధ్య ఎన్నో సంభాషణలు జరిగాయని  అయినా ఫలితం లేకపోయిందని పాంటింగ్‌‌‌‌ తెలిపాడు. జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పృథ్వీ ఇండియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో మరో వినోద్‌‌‌‌ కాంబ్లీ అవుతాడన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే 1990ల్లో ఇండియన్ క్రికెట్‌‌‌‌ ఇంతగా అభివృద్ధి చెందలేదు. కాంబ్లీని తిరిగి గాడిలో పడేసేందుకు ఆ సమయంలో అతని పక్కన ఎక్కువ మంది లేరు. ఇప్పుడు పృథ్వీ ముందు చాలా వనరులు ఉన్నాయి. తను సాయం అడిగితే ముందుకొచ్చే చేతులు చాలానే ఉన్నాయి. అంతకంటే ముందు పృథ్వీ తనతో తాను మాట్లాడుకోవాలి. జీవితంలో తాను ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవాలి. క్రికెట్‌‌‌‌లో ముందుకెళ్లాలని అనుకుంటే ముందుగా బరువు తగ్గించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఏ టోర్నీలో ఆడినా టన్నుల కొద్దీ పరుగులు సాధించాలి. పృథ్వీ 2.0గా తిరిగి రావాలి. ఇంత టాలెంట్‌‌‌‌ ఉన్న ప్లేయర్‌‌‌‌‌‌‌‌ను వదులుకోవడానికి ఇండియా క్రికెట్‌‌‌‌ సిద్ధంగా లేదు. 

సరైన అవకాశాలు రాని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ పృథ్వీకి చాలా అవకాశాలు లభించాయి. అయినా తనను వేలంలో ఎవరూ కొనకపోవడం,  కనీసం రూ. 75 లక్షలు ఇచ్చేందుకు కూడా ముందుకు రాకపోవడం సిగ్గుచేటు.  పృథ్వీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్ఫరాజ్ ఖాన్ మాదిరిగా డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో పరుగులు సాధించి తన సత్తా తగ్గలేదని  నిరూపించుకోవాలి. – మహ్మద్ కైఫ్‌‌

మెరుపులా వచ్చి..

నిజానికి పృథ్వీ షా క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన తీరు స్ఫూర్తి దాయకం. పసిప్రాయంలోనే తల్లిని కోల్పోయినా.. తండ్రి పంకజ్‌‌‌‌ షా  ప్రోత్సాహంతో ఎంతో కష్టపడిన షా ముంబై స్కూల్‌‌‌‌ క్రికెట్ నుంచి తనను తాను నిరూపించుకుంటూ వచ్చాడు. ఒక్కో అడుగు ముందుకేస్తూ  19 ఏండ్ల వయసులో ఓ మెరుపులా ఇండియా టీమ్‌‌‌‌లోకి వచ్చాడు. తన తొలి టెస్టులోనే సెంచరీతో ఔరా అనిపించాడు. అప్పటికే అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్ కప్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌గా ఇండియాను గెలిపించడం, రంజీల్లో సెంచరీల మోత మోగించడంతో పాటు అద్భుత ప్రతిభ ఉండటంతో షా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని అంతా అనుకున్నారు. 2018లో తన తొలి రెండు టెస్టుల్లో  ఓ సెంచరీ, ఫిఫ్టీతో మెరిసిన పృథ్వీ 2020లో తర్వాతి మూడు టెస్టుల్లో నిరాశపరిచాడు. 2020–21లో ఆరు వన్డేలు ఆడినా ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయాడు. దాంతో నేషనల్ టీమ్‌‌‌‌లో చోటు కోల్పోయిన షా మూడేండ్లయినా తిరిగి రాలేకపోయాడు. టన్నుల కొద్దీ టాలెంట్‌‌‌‌ ఉన్నా.. క్రమశిక్షణ లేకపోవడం వల్లనే  షా క్రికెట్ జీవితం ఇలా తలకిందులైందని చెప్పొచ్చు.