వరంగల్ ఆర్టీఏల్లో ఆగని నకిలీల దందా!

  • ఫేక్ సర్టిఫికెట్లకు అడ్డాగా మారిన ఆఫీసులు
  •  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు
  •  ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలన్నా.. రెన్యువల్ చేయాలన్నా అన్నీవారి చేతుల్లోనే..
  •  తాజాగా నలుగురి అరెస్ట్.. మరికొందరిదీ అదే తీరు
  •  తెరవెనుక అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలోని ఆర్టీఏ ఆఫీసుల్లో నకిలీల దందా ఆగడం లేదు. ఏజెంట్ల అవతారమెత్తిన   దుండగులు లైసెన్స్ రెన్యూవల్స్, వెహికల్ ఇన్సురెన్సలు, తదితర అవసరాలకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ దందా సాగిస్తున్నారు.

వాహనదారుల నుంచి అందినకాడికి వసూలు చేస్తున్నారు.  తాజాగా హనుమకొండ, వరంగల్ జిల్లా ఆర్టీఏ ఆఫీసుల్లో నలుగురు ఏజెంట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడంతో మరోసారి ఫేక్ సర్టిఫికేట్ల బాగోతం చర్చనీయాంశమైంది.  కొందరు ఆఫీసర్ల సహకారంతోనే  బ్రోకర్లు నకిలీ సర్టిఫికేట్ల  దందాకు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏజెంట్లు తెచ్చిందే సర్టిఫికేట్

సాధారణంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ప్రైవేటు ఏజెంట్ల దందా ఎక్కువగానే ఉంటుంది.  లర్నింగ్ లైసెన్స్ నుంచి రెన్యూవల్స్ వరకు, రిజిస్ట్రేషన్ నుంచి ఎక్స్ టెన్షన్ వరకు  ఏ పని కావాలన్నా కచ్చితంగా బ్రోకర్ ఉండాల్సిందే. ఒకవేళ బ్రోకర్ లేకుండా ఆఫీస్ లో ఏదైనా పని కావాలంటే మాత్రం చుక్కలు చూడాల్సిన పరిస్థితి.  ఫలితంగా వాహనదారులు తప్పనిసరిగా బ్రోకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

కాగా ఆర్టీవో ఆఫీసుల ఎదుట జిరాక్స్, రేడియం సెంటర్లు, లామినేషన్, పాన్ కార్డు సర్వీసుల పేరున దుకాణాలు ఏర్పాటు చేస్తున్న కొంతమంది ఏజెంట్ల అవతారం  ఎత్తుతున్నారు. ఆ తరువాత లర్నింగ్ లైసెన్స్, లైసెన్స్ రెన్యూవల్స్, వెహికల్ రిజిస్ట్రేషన్స్ తదితర సేవల కోసం వచ్చే వాహనదారులకు  ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి పెడుతున్నారు. దాని ప్రకారం వసూళ్లకు పాల్పడి, ఆ తరువాత ఆఫీస్ లోపలిదాకా వెళ్లి మరీ పనులు చేసుకొస్తున్నారు.

కాగా లైసెన్స్ వంటి వాటికి వాహనదారుల ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ అవసరం కావడంతో కొంతమంది ఏజెంట్లు ఆ సర్టిఫికేట్ కూడా వాళ్లే ఇష్యూ చేస్తున్నారు. తమకు తెలిసిన, తోచిన డాక్టర్ల పేరున రబ్బర్ స్టాంపులు తయారు చేయించి ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. ఆ తరువాత ఏజెంట్లే స్వయంగా ఆఫీసర్ల వద్దకు తీసుకెళ్తుండటంతో వారు  ఏ మాత్రం ఆలోచించకుండా రెన్యూవల్స్, రిజిస్ట్రేషన్స్ చేసేస్తున్నారు. ఇలా ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ల బిజినెస్ కూడా బాగానే నడుస్తుండటంతో ఇంకొంతమంది కూడా ఇదే దందాలో కొనసాగుతున్నారు. 

నకిలీలకు అడ్డాగా ఆఫీసులు

ట్రాన్స్​పోర్ట్​ ఆఫీస్ లకు వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వాహనదారులను అక్కడున్న బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. వాహనదారులకు తక్కువ ధరలో అన్ని పనులు చేసి పెడతామని చెప్పి తమకు నచ్చిన దందా చేసుకుంటున్నారు. కొంతకాలం కిందట వరంగల్ లో వెహికల్ ఇన్సురెన్స్ ల పేరున ఓ రెండు గ్యాంగులు దందాకు తెరలేపాయి. వెహికల్ రిజిస్ట్రేషన్ కు అవసరమైన ఇన్సురెన్స్ పేపర్లు నకిలీవి తయారు చేసి, మోసాలకు పాల్పడ్డాయి.

దీంతో  టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో  10 మందిని అరెస్ట్ చేసి, దాదాపు 4.46 లక్షల నగదు, కంప్యూటర్ సామగ్రి, 433 వెహికల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ కార్డులు, రబ్బర్ స్టాంపులు, ఫేక్ ఇన్సురెన్స్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. వారంతా  కలిసి సుమారు రూ.కోటి వరకు స్కామ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా వెనుక ఓ అధికారి ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఘటన జరిగిన మరికొద్దిరోజులకు నకిలీ ఇన్సురెన్స్ పేపర్లు తయారుచేస్తున్న మరో ఇద్దరు యువకులను కూడా పోలీసులు పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండ ఆఫీసులను అడ్డాగా చేసుకుని ఫిట్ నెస్ సర్టిఫికేట్ల దందా చేస్తున్న మరో నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ రెన్యూవల్స్ కోసం వివిధ నకిలీ పత్రాలు సృష్టిస్తున్న కొందరు వ్యక్తులు ఇప్పటికే పట్టుబడగా.. మరికొందరు కూడా ఇదే దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తెరవెనుక ఆఫీసర్ల హస్తం!

ఇప్పటికే పలుమార్లు ఫేక్ ఇన్సురెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ల బాగోతాలు బయటపడినా.. ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కొన్నేండ్లుగా దందా సాగుతున్నా ఆఫీసర్లు దృష్టి పెట్టకపోవడం పట్ల కూడా అనుమానాలు కలుగుతున్నాయి. దీంతోనే తెరవెనుక ఆఫీసర్ల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఆర్టీవో ఆఫీసుల కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికేట్ల దందాకు అడ్డుకట్ట పడాలంటే ముందుగా ఏజెంట్ల వ్యవస్థకు చెక్ పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇక్కడి ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.