సుల్తానాబాద్/వీర్నపల్లి/ కోనరావుపేట, వెలుగు: పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షాలు రైతులకు నష్టం కలిగించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల, తొగర్రాయి, కదంబాపూర్, రామునిపల్లె, రేగడిమద్దికుంట గ్రామాల్లో రాళ్ల వాన పడింది. దీంతో కనుకుల ధాన్యం కొనుగోలు సెంటర్‌లో దాదాపు 800 క్వింటాళ్ల వడ్లు తడిశాయి. పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతింది. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో వర్షంతోపాటు ఈదురుగాలులు తోడవడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి.
వీర్నపల్లిలోని ఎస్సీ కాలనీలో చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో గురువారం అర్ధరాత్రి గాలివానకు గౌరు లక్ష్మికి చెందిన ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. దీంతో పిల్లలతో ఆమె నిరాశ్రయులయ్యారు. లక్ష్మి భర్త నర్సయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా లక్ష్మీ కూలీ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఇంట్లో సామగ్రి అంతా తడిసిపోయి, నిలువనీడ లేకుండా పోయింది.