కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు: అన్నదాతల కష్టం.. నీళ్ల పాలైంది. అమ్మేందుకు మార్కెట్లలో, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు శనివారం కురిసిన అకాల వర్షంతో నీట మునిగాయి. వరదలో వడ్లన్నీ కళ్ల ముందే కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి జిల్లాలోనూ వర్షంతో ధాన్యం రాశులు తడిసిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, కరీంనగర్ రూరల్, జమ్మికుంట, సైదాపూర్, మానకొండూరు మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చొప్పదండి మార్కెట్లో వడ్ల కుప్పలు వందల సంఖ్యలో తడిసిపోయాయి. వర్షం దాదాపు గంటకు పైగా కురవడంతో మార్కెట్ యార్డులోకి పై నుంచి వచ్చే వరదతో వడ్లన్నీ కాల్వలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోతున్న వడ్లను రైతులు వానలోనే ఆపే ప్రయత్నం చేయడం అక్కడున్న వారిని కలిచివేసింది. రామడుగు మండల కేంద్రంలోని నీలం గంగయ్యకు చెందిన కొత్త ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన కడారి రాజేశం నాటుకోళ్ల షెడ్డు కూలి కోళ్లు చనిపోయి తీవ్ర నష్టం కలిగింది. ధాన్యం కల్లాలు నీటమునిగి చెరువులను తలపించాయి.