కరీంనగర్  జిల్లాలో వానలకు కొట్టుకుపోయిన వడ్లు

కరీంనగర్  జిల్లాలో వానలకు కొట్టుకుపోయిన వడ్లు
  •      కల్లాల్లో తడిసిపోయిన ధాన్యం
  •      రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఘటనలు
  •      టార్పాలిన్  కవర్లు లేక రైతుల ఇబ్బందులు
  •      రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగు పడి రైతు మృతి,
  •      70 గొర్రెలు మృతి.. యజమానికి గాయాలు

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో గురువారం కురిసిన వర్షాలకు పలు చోట్ల కల్లాల్లో  వడ్లు కొట్టుకుపోయాయి. కరీంనగర్  జిల్లా గన్నేరు వరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు సెంటర్ లో కుప్పగా పోసిన  ధాన్యం కొంత కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రంలో సొసైటీ సిబ్బంది కనీసం టార్పాలిన్  కవర్లు కూడా సమకూర్చలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు డిమాండ్  చేశారు. ఇదే మండలంలోని మైలారం గ్రామంలో  వర్షానికి వరి పంట నేలకొరిగింది.

కరీంనగర్  సిటీలో తెల్లవారుజామున, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వర్షం కారణంగా పద్మా నగర్‌లోని సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. కరీంనగర్ ఫైర్ యూనిట్ మంటలను అదుపులోకి తెచ్చింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ లో వడ్ల వానకు తడిసిముద్దయ్యాయి. ముస్తాబాద్  మండలంలో చీకోడు, పోతుగల్, గూడెం, నామాపూర్, ఆవునూర్  గ్రామాలలో  వర్షం దంచికొట్టింది.

దీంతో కల్లాలోని వడ్లు కొట్టుకుపోయాయి. గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. కోనరావుపేట మండలం ధర్మారం, మర్తనపేట, మల్కపేటతోపాటు పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో పోసిన వడ్లు తడిశాయి. కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. 

రోడ్డుపైనే మొలకెత్తిన మొక్కజొన్న  

నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం కొత్త చెరువు తండాలో  మొక్క జొన్నలను రోడ్డు మీద ఆరబెట్టగా.. వర్షానికి తడిసి మొలకలు వచ్చాయి.   దాదాపు వంద క్వింటాళ్ల మక్కజొన్నలు మొలకలు వచ్చాయని రైతు గోడవర్ల వెంకటయ్య వాపోయాడు. ఉప్పునుంతల మండలంలో  వరుసగా కురుస్తున్న ముసురుతో పంటలకు తెగుళ్లు సోకాయి. ముసురు వర్షాలకు నష్టపోయే ప్రమాదం ఉందని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.  

పిడుగు పడి రైతు స్పాట్  డెడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన రైతు కామిడి నర్సారెడ్డి (48) గురువారం ఉదయం 4 గంటలకు తన  పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు  డెడ్ బాడీని సిరిసిల్ల ఏరియా హస్పిటల్ కు  తరలించారు. నిర్మల్ ​ జిల్లా సారంగపూర్​ మండలం రాంసింగ్  తండాలో పిడుగుపాటుకు 70 గొర్లు చనిపోయాయి. గొర్లు కాసేందుకు వెళ్లిన వాటి యజమాని చౌహాన్ ​ వినేశ్​ పిడుగు ధాటికి అస్వస్థతకు గురయ్యాడు.

కూలిన మట్టిమిద్దె

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగర్​కర్నూల్  జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్లలో మట్టిమిద్దె కూలిపోయింది. వర్షాల వల్ల మిద్దె తడిసిపోయి బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ టైమ్​లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నిరుపేదలైన తమకు ప్రభుత్వం సాయం చేయాలని ఇంటి యజమాని పావనం శ్రీరాములు కోరాడు.