- కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట నష్టం
- వరి, మక్క, మామిడి పంటల రైతులకు నష్టం
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వానలు రైతులకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. ఈ యాసంగి సీజన్‌లో ఈ నెలలోనే దాదాపు 15 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. వరి, మక్క, మామిడి, కూరగాయల పంటలకు నష్టం ఎక్కువగా జరిగింది. వేలాది రూపాయలుపెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో దెబ్బతినటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుడు కూడా యాసంగి సీజన్లో 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇంత కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. మళ్లీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నెలరోజుల్లో నాలుగు సార్లు
ఈ సీజన్లో మార్చి16 రాత్రి నుంచి కామారెడ్డి, రాజంపేట, భిక్కనూరు, దోమకొండ, సదాశివనగర్, గాంధారి, రామారెడ్డి, బీబీపేట, బీర్కుర్, బాన్సువాడ, తాడ్వాయి మండలాల్లో భారీ వడగండ్ల వాన పడింది. కొన్ని చోట్ల వరి పంట నేలకొరగగా, మరి కొన్ని చోట్ల గింజలు రాలిపోయాయి. మక్క పంట పడిపోయింది. మామిడి కాయలు కంప్లీట్‌గా రాలిపోయాయి. 130 గ్రామాల్లో 20 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో కంప్లీట్‌గా పరిశీలన చేసి 10, 250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత గాంధారి, సదాశివనగర్ , తాడ్వాయి మండలాల్లో మరో సారి వడగండ్ల వాన పడింది. వరి, మక్క, జొన్న పంటలు నేలకొరిగాయి. 4 రోజుల క్రితం కామారెడ్డి, భిక్కనూరు మండలంలో కూడా వాన పడింది. శుక్రవారం మాచారెడ్డి, రామారెడ్డి, పాల్వంచ మండలాల్లో వర్షం కురిసింది. సోమార్పేట, అంకిరెడ్డిపల్లి తండా, వేనుకతండాల్లో భారీ ఈదురుగాలులతో వడగండ్ల వాన పడింది.
మరో సారి రైతులకు ఎక్కువే నష్టం సంభవించింది. కోతకొచ్చిన వరి గింజలు రాలిపోయాయి. పలువురు రైతులు పంట కోసి కల్లాల్లో వడ్లు ఆరబోయగా వరదలో వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
తడుస్తున్న వడ్లు
ఆయా గ్రామాల్లో కొనుగోలు సెంటర్లలో అరబోసిన వడ్లు ఆకాల వర్షాలకు తడిసిపోతున్నాయి. ఎండిన వడ్లను కాంటా పెట్టే టైంకు తడిసి ముద్దవుతుండటంతో మళ్లీ ఆరబోయాల్సి వస్తోందని రైతులు పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలోని పలు మండలాల్లో ఆకాశం మబ్బులు పట్టి ఉంది. కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. కల్లాల్లో ఆరబోసిన వడ్లను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.
నిరుడు అకాల వర్షాలకు 20,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయిన పరిహారం మాత్రం రాలేదు. ప్రతి సీజన్లో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయి ఆర్థికంగా కష్టాల పాలవుతున్నారు.