
వెలుగు నెట్‌వర్క్ :అకాల వర్షం ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను ఆగం చేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. దీంతో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, మిర్చి, బొప్పాయి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల కారణంగా మామిడికాయలు నేలరాలా యి. హనుమకొండ జిల్లాలో 4,626 ఎకరాల్లో మొక్కజొన్న, 945 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ధర్మసాగర్, ఐనవోలు, కాజీపేట, హసన్‌పర్తి, కమలాపూర్ మండలాల్లో 910 ఎకరాలల్లో మామిడి తోటలు, 99 ఎకరాల్లో కూరగాయలు పంటలు ధ్వంసం అయ్యాయి. వరంగల్‌లో ఈదురుగాలులకు పలు ఇండ్ల రేకులు ఎరిగిపోగా.. చెట్లు నేలకూలి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరంగల్ జిల్లాలో 57,855 ఎకరాల్లో పంట దెబ్బతినగా 43,423 మంది రైతులకు నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్న పంట 48,101 ఎకరాల్లో దెబ్బతింది. అలాగే 9,450 ఎకరాల వరి నేలమట్టమైంది. వడవండ్ల వాన, పిడుగుల కారణంగా దుగ్గొండి మండలం చాపలబండలో 30 మేకలు, గొర్లు మృత్యువాతపడ్డాయి. నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో పలుచోట్ల ఇండ్లు కూలిపోయాయి. జనగామ జిల్లాలో 4338 ఎకరాల్లో వరి, 1628 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో మిరప, 50 ఎకరాల్లో మామిడి, 27 ఎకరాల్లో జొన్న, 25 ఎకరాలో పొగాకు పంటలకు నష్టం జరిగింది. మన్‌సాన్‌పల్లిలో పిడుగు పడడంతో కోటూరి నర్సింహులుకు చెందిన సుమారు 60 వేల విలువైన ఎద్దు చనిపోయింది. కొడకండ్ల మండలం పాకాలలో గోడ కూలి కొమురయ్యకు చెందిన 11 గొర్రెలు చనిపోయాయి. వర్షం కారణంగా జిల్లాలో మొత్తం 2,451 మంది రైతులు నష్టపోయినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న 9,690 ఎకరాలు, వరి 4,890, మామిడి 3,050, మిర్చి 630, పెసర 50 ఎకరాల్లో దెబ్బతింది.
రైతులను ఆదుకుంటాం
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం జీబీ తండాలో దెబ్బతిన్న పంటలను మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, అగ్రికల్చర్ ఆఫీసర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, నెక్కొండ మండలం అప్పల్‌రావుపేట, రెడ్లవాడ, అలంకానిపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఖిలా వరంగల్ పరిధిలో ఎమ్మెల్యే నరేందర్, చిల్పూర్ మండలం లింగంపల్లిలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.