అకాల వర్షంతో ఆగమాగం .. తడిసిన వడ్లు, నేల కొరిగిన జొన్న

    
నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అకాల వర్షానికి ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల రైతులు ఆగమాగమయ్యారు. శుక్రవారం రాత్రి, శనివారం కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. అధికారులు టార్ఫాలిన్లు ఇవ్వకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, కంగ్టి, మనూర్, కల్హేర్, సిర్గాపూర్, నాగలిగిద్ద మండలాల్లో వాన దంచి కొట్టింది. కంగ్టి మండలంలో అత్యధికంగా 64.5 మిల్లీమీటర్లు, మనూర్‌‌‌‌‌‌‌‌లో 43.2, నాగల్‌‌‌‌‌‌‌‌గిద్దలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందల ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడి కోలుకోలేని దెబ్బ తీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
    
ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులకు జొన్న నేలకొరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఆదిలాబాద్, బోథ్, నేరడిగొండ, బజార్‌‌‌‌‌‌‌‌ హత్నూర్, జైనథ్‌‌‌‌‌‌‌‌ మండలాల్లోని జొన్న పంట తడిసిపోయింది. దీంతో జొన్న నల్ల బడుతుందని,  నేలకొరిగిన పంట చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 1000 ఎకరాల్లో జొన్న దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.
    
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముసురు పడుతుండడంతో మోపాల్, బోర్గం గ్రామాల్లో వరి నేలకొరిగింది. కోతలు పూర్తయి ఆరబెట్టిన వడ్ల కుప్పలపై రైతులు కవర్లు కప్పుకున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. 
    
కామారెడ్డి జిల్లాలో ఆకాల వర్షం వల్ల అరబోసిన వడ్లు తడిసిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 3 సార్లు వాన పడింది. దీంతో 12 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. ఎల్లారెడ్డి, లింగంపేట, బీర్కూర్‌‌‌‌‌‌‌‌, బాన్సువాడ, పిట్లం, భిక్కనూరు మండలాల్లో వడ్ల కుప్పలు తడిసిపోయాయి.