- ఈదురుగాలులతో విరిగిన చెట్లు, తెగిపడ్డ తీగలు
- సాయంత్రం కావడంతో ఇండ్లకెళ్లే జనాలు ఆగం
- అకాల వర్షంతో పలుచోట్ల తడిసిన రైతులు పండించిన ధాన్యం
వరంగల్, వెలుగు : ఓరుగల్లువ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో మొదలైన వర్షం కాసేపటికే ఉరుములు, మెరుపులతో జనాలను వణికించింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో జనాలు ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో వాన మొదలవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు కరెంట్ కట్ కావడంతో సిటీతోపాటు వందలాది కాలనీల్లో చీకట్లు అలుముకున్నాయి. ఈదురుగాలులకు రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడటం, కేబుల్స్ తెగి వాహనాలకు అడ్డుపడటంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. వర్షం రాత్రి వరకు అలానే కురిసింది.
రూరల్ జిల్లాల్లో రైతులు ఆగం..
వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని రూరల్ మండలాలతో పాటు మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వర్షం సాయంత్రం సమయంలో ఆగం చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, నెల్లికుదుర్ల, కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్, మరిపెడ మండలాల్లో అకాల వర్ష కారణంగా పలు గ్రామాల్లో కరెంట్ నిలిచిపోయింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దాయ్యాయి. రాత్రి సమయం కావడంతో చీకట్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన పంట అకాల వర్షం కారణంగా నీటిపాలు కావడంతో కన్నీరే దిక్కైంది.
ధాన్యాన్ని బయట ఆరబోసే పరిస్థితులు లేకపోవడంతో మొలకలొచ్చి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్సింగ్తండాలో గాలివాన బీభత్సానికి ఓ ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. జనగామ పట్టణంలో సుమారు గంటపాటు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్డు, చౌరస్తాలో భారీగా నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.