అకాల వర్షాలతో అన్నదాతల గోస..

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యం చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. వడగండ్ల వల్ల లక్షలాది ఎకరాల్లో వరి, మిరప, మొక్కజొన్న, వేరుశనగ, మామిడి వంటి పంటలు నాశనమై రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

పంట నష్ట పరిహారానికి కోత

గత నెల మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వాన కురిసి 2.28లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రకటించింది. 22 జిల్లాల్లో రైతులు పంటలు కోల్పోయారని తెలిపింది. గతంలో ఎన్నడూ రైతులకు ముఖం చూపని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో హఠాత్తుగా ఆయనకు వారిపై ప్రేమ పుట్టుకొచ్చింది. మంత్రులను, అధికారులను మందిమార్బలాన్ని వెంటవేసుకొని బస్సులలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించి వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేలు సహాయం చేస్తామని ఆయన ప్రకటించారు. దీనికోసం తక్షణమే రూ. 228కోట్లు విడుదల చేస్తామని, కౌలు రైతులకు సైతం పరిహారం ఇస్తామని, 10 రోజుల్లోనే సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ పరిహారం అందించే సమయానికి మాట మార్చి ముందు ప్రకటించిన 2.28లక్షల ఎకరాలను 1.51లక్షల ఎకరాలకు కుదించి, 77 వేల ఎకరాలకు కోత విధించారు. పరిహారాన్ని రూ. 228కోట్ల నుంచి రూ. 151కోట్లకు కుదించారు. 10రోజుల్లో పరిహారం అందిస్తామని ప్రకటించి నెల రోజులు గడిచినా ఇంతవరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఎగవేయడానికి రకరకాల నిబంధనలు, సాకులు చూపుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదేవిధంగా నిబంధనలు చూపింది. 

మార్కెట్​యార్డుల్లో షెడ్లు  కట్టరెందుకు?

ఈనెల 23 నుంచి మళ్లీ వర్షాలు ప్రారంభమై రైతులకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల పంటలకు రక్షణ కరువైంది.  రాష్ట్రంలో 230 మార్కెట్ యార్డులున్నాయి. కానీ వాటిలో దశాబ్దాల క్రితం నిర్మించిన గోదాములే ఉన్నాయి. ఇవి సరిపోక ఆరుబయటే ధాన్యాన్ని కుప్పలుగా పోస్తుండటంతో వర్షాలకు ధాన్యం నాని పనికిరాకుండా పోవడంతో రైతులు నిస్సహాయంగా చూస్తుండిపోతున్నారు. పెద్దతరహా మార్కెట్ యార్డులకు ఏటా రూ.10కోట్లు, చిన్న యార్డులకు రూ.కోటి, సబ్ మార్కెట్ యార్డులకు రూ.10లక్షల వరకు రాబడి వస్తోంది. ఇంత ఆదాయం వస్తున్నా రైతులకు మార్కెట్ యార్డులలో మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించటం లేదు. ధాన్యం అమ్ముకునేవరకు మార్కెట్ యార్డులలో ధాన్యం ఆరబెట్టుకోవడానికి రేకుల షెడ్లు నిర్మిస్తే ధాన్యం తడిసిపోకుండా ఉంటుంది. ప్రతీ సంవత్సరం ఈవిధంగా వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నది. లక్షలు పెట్టుబడి పెట్టి శ్రమించి మార్కెట్ యార్డులకు తెచ్చిన తరువాత వర్షాలకు వడ్లు తడిసి మొలకలొచ్చి పనికిరాకుండా పోతున్నాయి. నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలైనట్లుగా చేతికొచ్చిన కోట్ల విలువైన ఆహార ధాన్యాలు నేలపాలవటం బాధాకరం.

కొనుగోలు కేంద్రాలు ఎన్ని  పనిచేస్తున్నాయి? 

రాష్ట్రంలో రైతులకోసం పల్లెల్లో రూ.572కోట్ల ఖర్చుతో 2,601 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించి రెండేళ్లు దాటినా వీటిలో ఎటువంటి కార్యకలాపాలు జరగక నిరుపయోగంగా ఉన్నాయి. ఈవిధంగా పనికిరాని పనులపై ప్రభుత్వం డబ్బులు కుమ్మరించే కన్నా మార్కెట్ యార్డులలో ధాన్యం తడిసిపోకుండా షెడ్లు నిర్మిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని, తెలంగాణ దేశానికే అన్నం పెడుతోందని, తమది రైతు ప్రభుత్వమని బీఆర్ఎస్ నాయకులు నిరంతరం కోతలు కోస్తుంటారు. కానీ ఆచరణలో రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదు. మార్కెట్ యార్డుల్లోకి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు ఈ కష్టాలు తప్పేవి. దాదాపు నెలరోజుల నుంచి ధాన్యం మార్కెట్లోకి వస్తున్నా ఇంతవరకు కేవలం 2,290 కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. మార్చి 25 నాటికి కేవలం 3.12లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. కొనుగోలు జాప్యంతో చివరకు ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పొలాల్లో తడిసిపోయిన ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. మార్కెట్ యార్డుల్లో తడిసిపోయే ధాన్యానికి ఎవరు నష్టపరిహారం చెల్లించాలి?

ఆహార కొరత ఏర్పడే అవకాశం!

ఎల్​నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగతలు తథ్యమని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ దిగుబడులు తగ్గుతాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ హెచ్చరిస్తోంది. ధరలు పెరిగి పేదలకు ఆహారం అందని పరిస్థితులు ఏర్పడతాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత సంవత్సరం వరదలు సంభవించి పాకిస్తాన్ లో పంటలు మొత్తం నాశనమవడంతో అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రొట్టెల పిండి కోసం తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వాలు పంటల నష్ట నివారణ చర్యలకు దిగాలి. రైతుభద్రత లేకుండా ఆహార భద్రత ఏవిధంగా సాధ్యమవుతుంది? దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని పంటలకు వర్తించేలా పంటల బీమా ఉండాలని వ్యవసాయరంగ నిపుణులు స్వామినాథన్ చేసిన సిఫారసులు అమలు చేస్తేనే పంటలకు రక్షణ ఉంటుంది. రైతులు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిలలాడుతున్నారు. ఈ పంటల నష్టంతో వారిపై అప్పుల భారం మరింతగా పెరిగిపోతోంది. దీని కారణంగా రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. 

రుణమాఫీ ఇంకెప్పుడు?

రైతులు కల్తీ విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, వ్యవసాయ పెట్టుబడి పెరగడం, పంటలకు తెగుళ్లు, కూలీల కొరత వంటి సవాలక్ష సమస్యలతో వ్యవసాయరంగం కుదేలవుతోంది. వీటన్నింటిని మించి రైతులపై ఏటేటా రుణభారం పెరిగిపోతోంది. లక్ష వరకు పంట రుణమాఫీ చేస్తామని 2019 ఎన్నికల్లో బీఆర్ యస్ హామీ ఇచ్చింది. కానీ నాలుగేళ్లు గడిచినా రూ.37 వేల వరకే రుణమాఫీ చేసింది. మిగతా మొత్తం రుణమాఫీ కావాలంటే ఇంకా రూ. 20,351కోట్లు కావాలి. ఈ సంవత్సరం బడ్జెట్లో రుణమాఫీకి ప్రభుత్వం కేవలం రూ.6385కోట్లు మాత్రమే కేటాయించి, అది రూ. 90వేల రుణమాఫీకి సరిపోతాయని ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోంది. ఇది రైతులను మోసం చేయడం కాదా? రుణమాఫీ జరగక రైతులను బ్యాంకులు ఎగవేతదారులుగా ప్రకటించి కొత్త రుణాలు ఇవ్వటం లేదు. అప్పులు తీర్చటం లేదని కొన్ని చోట్ల బ్యాంకర్లు రైతుల ఇళ్లపై పడి ఇంట్లో సామాను ఎత్తుకొని పోతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రక్షణ కోసం గట్టి చర్యలకు దిగాలి. వ్యవసాయ బడ్జెట్ ను మరింతగా పెంచాలి. విపత్తుల నుంచి ఆదుకోవటానికి రైతుల కోసం ప్రత్యేక నిధిని కేటాయించాలి. మార్కెట్ కు  వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలి. మార్కెట్ యార్డులలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి. తక్షణం రైతు రుణమాఫీ పూర్తి చేయాలి.

పంటల బీమా పథకం ఏది?

2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంటలు దెబ్బతింటే ఈ పథకం కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. ఈ పథకం వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగటం లేదని, దీనికన్నా మెరుగైన బీమా పథకాన్ని తెస్తామని చెప్పి 2019లో దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగింది. కానీ ఇంతవరకు ఎటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలేదు. దీనితో ప్రతీ సంవత్సరం లక్షల ఎకరాల్లో అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు ఏవిధమైన పరిహారం అందడం లేదు. 2020లో 5.10లక్షల ఎకరాల్లో వరి, 7.75లక్షల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. ఈ సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. విపత్తుల నిర్వహణ క్రింద కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో రూ.188కోట్లు వాడుకోవటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బులు కలిపి రైతులకు సహాయం చేస్తే ఉపయోగకరంగా ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక్క పైసా కూడా పరిహారం అందించకపోగా కేంద్రమిచ్చిన నిధులను సైతం రైతులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. 2022లో 1,92,984 ఎకరాలలో పంట నష్టం జరిగింది. దీనికి సైతం ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పరిహారం అందించలేదు.

- కాసాని జ్ఞానేశ్వర్,అధ్యక్షుడు, 
తెలుగుదేశం పార్టీ, తెలంగాణ