అకాల వర్షా లతో అపార నష్టం

  • సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో భారీగా మామిడి తోటలు ధ్వంసం
  •     విద్యుత్ శాఖకు రూ.కోటి నష్టం
  •     సర్కార్​కు రిపోర్ట్ పంపించిన అధికారులు

సూర్యాపేట/యాదాద్రి, వెలుగు:  అకాల వర్షాలకు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో  అపార నష్టం వాటిల్లింది. రెండు రోజులు కురిసిన వర్షాలకు కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మరోవైపు ఈదురు గాలుల ప్రభావంతో  వరి పైర్లు, మామిడి కాయలు నేలరాలాయి. ఫలితంగా లక్షల్లో  నష్టం వాటిల్లింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో దెబ్బ తినడంతో  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వానలు కురుస్తాయన్న  వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.  

భారీగా మామిడి తోటలు ధ్వంసం

జిల్లాలో రెండు రోజులు కురిసిన అకాల వర్షాలకు వరి పంట నెలకొరగగా మామిడి తోటలు   ధ్వంసమయ్యాయి.  సూర్యాపేట జిల్లాలోని  సూర్యాపేట, ఆత్మకూరు(ఎస్), జాజిరెడ్డి గూడెం, మద్దిరాల  మండలలతో పాటు మొత్తం 10మండలాల్లో 1429 ఎకరాల మామిడి, 17.05ఎకరాల అరటి తోట లకు నష్టం వాటిల్లింది. యాదాద్రి జిల్లాలో 139 ఎకరాల మామిడి, 47ఎకరాలలో వరి, 8ఎకరాల పుచ్చకాయ, 2ఎకరాల నిమ్మ తోట దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాధమికంగా అంచనా వేసింది. పంట నష్టాన్ని  అధికారులు అంచనా వేయనున్నారు. 

విద్యుత్ శాఖకు రూ.కోటి నష్టం

భారీ వర్షాలకు విద్యుత్ శాఖకు రూ. కోటి నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లాలో రూ.80లక్షల నష్టం వాటిల్లగా యాదాద్రి జిల్లాలో రూ.20లక్షల నష్టం కలిగింది.  సూర్యాపేట జిల్లాలో  ఫీడర్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. సూర్యాపేట ఈహెచ్​టీ కింద 14 ఫీడర్లలో 13 ఫీడర్లు , మునగాలలో నాలుగు ఫీడర్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పిడుగుల కారణంగా నెమ్మికల్ నుంచి నూతన్ కల్, మద్దిరాల సబ్ స్టేషన్ పరిధిలో దాదాపు 38 స్తంభాలు  ధ్వంసమయ్యాయి.  

వీటితో పాటు 192 ఎల్టీ పోల్స్ ధ్వంసం కగా  అవ్వగా 86 పోల్స్ తిరిగి ఏర్పాటు చేశారు. మరో 106 పోల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది.  11కేవీ పోల్స్ 124 ద్వంశం అయ్యాయి.  వాటిలో 60  మార్చగా  మరో 64 పోల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. యాదాద్రి జిల్లాలో 220 స్తంభాలు, 06 ట్రాన్స్ ఫార్మార్స్ దెబ్బ తిన్నాయి.  జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన   నష్టాన్ని   అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందించారు.