తెలంగాణలో గత రాత్రి పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల ఆస్తి నష్టం సంభవించింది. సిరిసిల్ల జిల్లాలో గత అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కుడిన వర్షం పడింది. వరి కోత దశలో ఉన్న వరి పొలాలకు వడగడ్ల వానతో నష్టం జరిగింది. ఈ అకాల వర్షానికి వీర్నపల్లి, ఎల్లారెడ్డిపెటలో వరి పంటలు నేల రాలాయి. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి దెబ్బ తినడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.
ఇక మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలుచోట్ల వరి పంట, మొక్కజొన్న, కూరగాయ పంటలు దెబ్బతిని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈ భారీ వర్షానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ట్రాన్సఫార్మర్లు దెబ్బతిన్నాయి. తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో పిడుగుపాటుకు రెండు ఆవులు, బర్రెలు మృతి చెందాయి.