అకాల వర్షంతో.. అన్నదాతలు ఆగం..తుఫాన్‌‌ కారణంగా నీట మునిగిన వరి

  •     దెబ్బతిన్న మిర్చి, పత్తి

మహబూబాబాద్‌‌/నర్సంపేట/నల్లబెల్లి/నర్సింహులపేట/మంగపేట/తొర్రూరు, వెలుగు : తుఫాన్‌‌ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో అన్నదాతలు ఆగమైతున్రు. వరంగల్‌‌ జిల్లా నర్సంపేట, నల్లబెల్లి, మహబూబాబాద్‌‌ జిల్లా నర్సింహులపేట, తొర్రూరు, గార్లతో పాటు మంగపేట మండలంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వరి నేలవాలగా, వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు తడిసిపోయాయి. ఐకేపీ, పీఏసీఎస్‌‌‌‌ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నిర్వహించకపోవడంతో వడ్లు తీసుకొచ్చిన రైతులు పది రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.

ఇదే టైంలో వర్షం పడడంతో వడ్లు తడవకుండా చూసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అలాగే పత్తి, మిర్చి పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. నర్సంపేట ప్రాంతంలో సాగయ్యే చపాట రకం మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌‌లో మంచి డిమాండ్‌‌ ఉంటుంది. ఇక్కడి మిర్చి నాగపూర్‌‌, బాంబే మార్కెట్లకు ఎగుమతి అవుతుంది. అకాల వర్షం వల్ల మిర్చి రంగు మారి డిమాండ్‌‌ తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో కోసిన వరి పూర్తిగా మునిగిపోయింది. వర్షం ఇలాగే కొనసాగితే చేతికొచ్చిన పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలని, దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మహబూబాబాద్‌‌ జిల్లాలోని చిన్నగూడురులో 62.2 మిల్లీమీటర్లు, కేసముద్రం 65.6, డోర్నకల్‌‌లో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.