గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం.. అపార నష్టం

గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం.. అపార నష్టం
  • గోడకూలి ఒకరు మృతి
  • దెబ్బతిన్న వరి, కూరగయాల పంటలు 

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన ఈదురుగాలులు, వడగండ్ల వానకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోయాయి. కొన్నిచోట్ల గుడిసెలు, కోళ్ల ఫారాలు కూలి ఆస్తి నష్టం సంభవించింది. వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వర్గల్​ మండలంలోని నెంటూరు గ్రామంలో గంటపాటు వడగండ్లు కురిశాయి. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ లోని పొద్దుతిరుగుడు ధాన్యం తడిసిపోయింది. 

గోదాం గోడ కూలి ఒకరు మృతి.. 

గజ్వేల్​ మండలంలోని జాలిగామ గ్రామంలో నిర్మాణంలో ఉన్న  ఒక ప్రైవేట్ గోదాం ప్రహరీ కూలి పట్టణానికి చెందిన ఎండీ  హిమ్మత్ ఖాన్(52) చనిపోయాడు. గోదాంలో ఎలక్ర్టిషన్​ పనులు చేయడానికి వెళ్లగా భారీ వర్షం కురవడంతో ఇటీవల నిర్మించిన ప్రహరీ కూలింది. పక్కనే పనిచేస్తున్న ఇమ్మత్​ ఖాన్ పై గోడ పడడంతో చనిపోయాడు. మృతుడు గజ్వేల్​ ఏఎంసీ వైస్​ చైర్మన్​సర్ధార్​ఖాన్​కు సోదరుడు. ఇమ్మత్​ఖాన్​మృతి గురించి తెలుసుకుని డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి మృతుడి 
కుటుంబాన్ని పరామర్శించారు. 

సంగారెడ్డి, మెదక్​జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో వాతావరణం చల్లబడి చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. అమీన్​పూర్, పటాన్ చెరు, జహీరాబాద్, సదాశివపేట మండలాల్లో మోస్తారు వర్షం పడింది. సదాశివపేట మండలం ఇస్త్రీతాబాద్ లో పిడుగు పడి 20 మేకలు చనిపోయాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన కురుమ మహిపాల్ తన రెండెకరాల పొలం కోసి వడ్లు  రోడ్డుపై ఆర పోశాడు. అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి వడ్లన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. గంట సేపు భారీ వాన పడడంతో రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రహదారి పూర్తిగా  జలమయమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.