
1891లో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న రోజుల్లో మధ్యప్రదేశ్ లోని మోవ్ అనే ప్రాంతంలో పుట్టారు అంబేద్కర్. పూర్తి పేరు భీంరావ్ రామ్ జీ అంబేద్కర్. ఆయన పుట్టిన ప్రాంతానికి ఇవాళ డాక్టర్ అంబేద్కర్ నగర్ అనే పేరుంది. ఇండియన్ ఆర్మీలో సుబేదార్ గా పనిచేసేవారు అంబేద్కర్ తండ్రి రామ్ సక్పాల్. 14 మంది పిల్లలు ఆయనకు.
వాళ్లలో చివరి వాడు అంబేద్కర్. బాల్యం అనగానే ఆటలు, పాటలు, చుట్టూ ఉన్నవాళ్లు ప్రేమగా చూసుకుంటుంటే కలిగే ఆనందంలో తేలిపోవడమే గుర్తొస్తుంది ఎవ్వరికైనా. అంబేద్కర్ మాత్రం చాలా చిన్న వయసు నుంచే కుల వివక్షను ఎదుర్కొన్నారు. అంటరానివాళ్లు అనే పేరు చెప్పి అంబేద్కర్ను దగ్గరికి రానిచ్చేవాళ్లు కాదు చాలా మంది.
మహర్ అనే కులంలో పుట్టాడు అంబేద్కర్. వాళ్లను అంటరానివాళ్లుగా చిత్రించి.. చివరికి బడిలో కూడా వివక్ష చూపించేవారు. ఇది ఏ స్థాయిలో ఉండేదో అంబేద్కర్ స్వయంగా తన రచనల్లో చెప్పుకొచ్చారు. పాఠాలు చెప్పే టీచర్లు కూడా.. అయితే చివరి బెంచీలోనో.. లేదంటే క్లాస్ రూమ్ బయటో కూర్చేబెట్టేవారట. బడిలో నీళ్లు తాగే దగ్గర కూడా అవమానాలే ఎదుర్కొన్నాడు అంబేద్కర్. "నీళ్లు తాగడానికి నల్లాను మేం ముట్టుకోవద్దు. అటెండరో, ప్యూనో వచ్చి.. నల్లా తిప్పితేనే నీళ్లు తాగాలి. ఎందుకంటే.. మేం అంటరానివాళ్లం. ఒక్కోసారి ఎప్పుడైనా ప్యూన్ రాలేదంటే, ఇంక ఆ రోజు తాగడానికి నీళ్లు లేనట్టే.” అని బాల్యంలో తాను ఎదుర్కొన్న కుల వివక్ష గురించి చెప్పాడు అంబేద్కర్. అప్పట్నుంచే ఈ అవమానాలకు ఎదురు తిరిగి పోరాడాల్సిన అవసరం ఉందని గ్రహించాడు అంబేద్కర్. చదువుల్లో ఎప్పుడూ నెంబర్ వన్ గా ఉన్నాడు. అంటరానివాళ్లుగా అవమానాలు ఎదుర్కొనేవాళ్లు సమాజంలో నిలబడాలంటే చదువు ముఖ్యమని నమ్మాడాయన.
అంబేద్కర్ పోరాటం మొదలైంది ఇక్కడే
27 ఏళ్ల వయసులో అంబేద్కర్ ను ఇవన్నీ వెంటాడాయి. ఎక్కడ చూసినా అంటరానితనం పేరుతో తమలాంటి వాళ్లను తక్కువ చూడటమే కనిపించింది. ఏం చేయాలి? తనే ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. దళితుల హక్కుల కోసం ముందుండి పోరాడాడు. దళితుల ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు పత్రికలు పెట్టాడు. వ్యాసాలు రాశాడు. లండన్ లో ఆగిపోయిన తన చదువును పూర్తిచేసుకొని తిరిగొచ్చాడు.
Also Read : అంబేద్కర్ను దూరం చేయాలని ఎన్ని కుట్రలు చేసినా ఫలించవు
1924 నుంచి దళితుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తూనే వచ్చాడు అంబేద్కర్. సామాజిక చైతన్యం ఒక్కటే సరిపోదని.. రాజకీయంగా కూడా శక్తిని కూడగట్టాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటూనే అదే ఉద్యమంలో అందరి ఆలోచనల్లో చొరబడి ఉన్న కుల వివక్షను వ్యతిరేకించాడు. కాంగ్రెస్ పార్టీని, గాంధీతత్వాన్ని వ్యతిరేకించాడు. కులవివక్ష కోసం తన పోరాటం ఎప్పటికీ ఆగదని తేల్చి చెప్పాడు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినా.. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. అంబేద్కర్ ను తన కేబినేట్ లో ఉండమని కోరాడు. న్యాయ శాఖ మంత్రిగా పని చేశాడు అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పడగానే దానికి చైర్మన్ గా అంబేద్కర్ను నియమించి.. రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యతను ఆయనకిచ్చారు.
ఆ రాజ్యాంగమే భారతదేశాన్ని ఇవ్వాళ ప్రపంచం ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టింది.