- ఏర్పాటుపై గత ప్రభుత్వం హడావుడి
- రెండేండ్లుగా ప్రపోజల్స్కే పరిమితం
- కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారిస్తే జిల్లా వాసులకు మేలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హడావుడి చేసి రెండేండ్లు కాలం వెళ్లదీసింది. చివరికి ఎలాంటి పని మొదలు పెట్టకుండానే జిల్లా వాసులను ఆశల్లో ముంచి చేతులెత్తేసింది. అనుకూలమైన ల్యాండ్ వెతుకుతున్నామని బీఆర్ఎస్ లీడర్లు ఆ మధ్య ప్రచారం చేశారు. ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టారు. చివరికి నాలుగు చోట్ల ల్యాండ్ చూసి, తర్వాత ఆ మాటే మర్చిపోయారు.
ఆశ చూపి మోసం..
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ జిల్లాకు మంజూరైందంటూ బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు కలెక్టర్ అనుదీప్ దాదాపు రెండేండ్ల కిందట ప్రకటించారు. త్వరలోనే యూనిట్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ల్యాండ్ సేకరించాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి.
దాదాపు 100 నుంచి 200 ఎకరాల వరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ల్యాండ్ అవసరం ఉంది. ల్యాండ్ కోసం రెవెన్యూ ఆఫీసర్లను, అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పరుగులు పెట్టించారు. పలు మీటింగ్లలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ శాంక్షన్ గురించి చర్చించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, ఆళ్లపల్లి, అశ్వారావుపేట, అశ్వాపురం మండలాల్లో అవసరమైన స్థలాలను రెవెన్యూ అధికారులు టీఎస్ఐఐసీ ఆఫీసర్లకు చూపించారు. ఆయా మండలాల్లో 100 నుంచి 150 ఎకరాల ల్యాండ్‌ను రెవెన్యూ అధికారులు సెలెక్ట్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
యూనిట్‌తో జిల్లాకు మేలు..
జిల్లాలో దాదాపు 11వేల ఎకరాల్లో మామిడి, దాదాపు 14వేల ఎకరాల్లో జీడి, జామ, అరటి, బొప్పాయి. సీతాఫల్, పనస, నేరేడు వంటి పండ్ల తోటలు వేల ఏకరాల్లో సాగు చేస్తున్నారు. ఇవే కాకుండా కూరగాయల తోటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. దాదాపు 2,593 ఎకరాల్లో టమాటా, ఇతరత్రా కూరగాయలు దాదాపు 7వేల ఎకరాల్లో పండిస్తున్నారు.
Also Read : 7 కోట్లతో కడితే.. 7 నెలలకే కుంగింది
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ప్రధానంగా పండ్ల తోటలు సాగు చేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో పండించిన మామిడి హైదరాబాద్, విజయవాడతో పాటు విదేశాలు, ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోంది. ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తే పండ్ల వ్యాపారులకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. జిల్లాలోని పాల్వం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, ఆళ్లపల్లి, అశ్వారావుపేట, అశ్వాపురం ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్‌కు సంబంధించిన ప్రతిపాధనలను టీఎస్ఐఐసీ ఆఫీసర్లకు పంపించామని జిల్లా ఆఫీసర్లు అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరుతున్నారు.