- ఉన్న చోట నిర్వహణను పట్టించుకోని పోలీసులు
- నగరంలో పెరిగిన చోరీలు, ఇతర నేరాలు
- నిందితుల గుర్తింపులో ఇబ్బందులు
హనుమకొండ, వెలుగు : ఒక్కో సీసీ కెమెరా వంద మంది ఖాకీలతో సమానమని తరచూ పోలీస్ అధికారులు చెబుతుంటారు. కానీ అలాంటి కెమెరాలు అవసరమైన చోట లేకపోవడం, ఉన్న చోట్ల సరిగా పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఫలితంగా కేసులు నెలలు, ఏండ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల గొడవలు, దాడులు, యాక్సిడెంట్లు, చోరీలు, ఇతర నేరాలు పెరిగిపోయాయి. ఆయా కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా కాగా కమిషనరేట్ పరిధిలోని చాలా చోట్ల నిఘా నేత్రాలకు నిర్లక్ష్యపు నీడ కమ్ముకుంది.
క్రైమ్ స్పాట్లుగా పేరున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న చోట నిర్వహణ సరిగా లేకపోవడంతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మరో వైపు నేరాల నియంత్రణకు వరంగల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు ప్రకటించినా ఇంతవరకూ దాని ఊసెక్కడా లేదు.
నిర్వహణ లేక అలంకారప్రాయంగా కెమెరాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉండగా, ఆయా జిల్లాల్లో అన్నీ కలిపి 51 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి 39 మండలాలు, సుమారు 23.65 లక్షల జనాభా ఉంది. రోజు రోజుకు జనాభా పెరుగుతుండగా.. అదే తీరుగా చోరీలు, ఇతర నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. దీంతో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. పోలీసులు మూడు జిల్లాల పరిధిలోని పలు సంస్థలు, వ్యాపారుల సహకారంతో సుమారు 55 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.
ఇందులో సగం కెమెరాలు వరంగల్ నగర పరిధిలోనే ఉండడం గమనార్హం. అయితే సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో చాలా చోట్ల కెమెరాలు రిపైర్లకు గురయ్యాయి. కెమెరాలను ఇన్‌స్టాల్ చేసే సంస్థ ఒకటి, రెండేళ్ల పాటు నిర్వహణను చూసుకుంటుంది. తర్వాత వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో చాలా కెమెరాలు అలంకారప్రాయంగానే మారాయి.
మరుగున పడిన సెక్యూరిటీ కౌన్సిల్
వరంగల్‌లో నేరాల నియంత్రణ కోసం వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలను సభ్యులుగా చేరుస్తూ ‘సొసైటీ ఫర్ వరంగల్ సెక్యూరిటీ కౌన్సిల్’ ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, ఇతర రక్షణ చర్యలకు ప్లాన్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, నేరాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
నిందితుల గుర్తింపులో ఇబ్బందులు
సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడంతో వివిధ కేసుల్లో నిందితుల గుర్తింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్టోబర్ 23న హసన్‌పర్తి పీఎస్ పరిధి నల్లగట్టు గుట్ట ఏరియాలో చింతగట్టుకు చెందిన సతీశ్ అనే ప్రైవేట్ స్కూల్ బస్‌డ్రైవర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో సతీశ్కాలును డాక్టర్లు తీసేశారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతమైనా అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడు ఎవరనేది ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. 65వ డివిజన్ దేవన్నపేటలో కొద్దిరోజుల కింద ఓ రైతుకు చెందిన ఎడ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అక్టోబర్ నెలలో ఎల్కతుర్తి పీఎస్పరిధిలో ఒకే రోజు మూడు ఇండ్లలో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల వరంగల్ బస్టాండ్సమీపంలో ఓ యువకుడిపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. సీసీ కెమెరాలు సరిగా లేకపోవడంతో నిందితులను గుర్తించడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన ఓ వృద్ధురాలిని జూన్ 26న గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లి పరకాల సమీపంలో మర్డర్ చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లారు. శాయంపేటలో సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయకపోవడంతో నిందితులను ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకే రోడ్డు వెడల్పులో భాగంగా అక్కడున్న సీసీ కెమెరాలు తొలగించి, సమీపంలోని ఓ హోటల్‌లో భద్రపరిచారు. ఇంతవరకు వాటికి రిపేర్లు చేయలేదు.. మళ్లీ బిగించలేదు.
కాజీపేట రహమత్ నగర్‌లో నాలుగు రోజుల కింద ఓ వృద్ధురాలి మర్డర్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకుని, డెడ్‌బాడీని పక్క గల్లీలో పడేశారు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, ఆ గల్లీకి కనెక్టివిటీ గల రోడ్లపై ఉన్న కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.