- 3న వసంత పంచమి సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ప్రయాగ్రాజ్: మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోవడంతో యూపీ సర్కార్ అప్రమత్తమైంది. కుంభమేళా నిర్వహణలో అమలు చేస్తున్న రూల్స్ మార్చింది. వీవీఐపీ, స్పెషల్ పాస్ లను రద్దు చేసింది. కుంభమేళా ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మీటింగ్ అనంతరం నిబంధనలకు సంబంధించిన మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు మహా కుంభమేళా ప్రాంతంలోకి వెహికల్స్ రాకుండా నిషేధం విధించామని, వీవీఐపీ, స్పెషల్ పాస్ లను రద్దు చేశామని తెలిపింది. ప్రయాగ్రాజ్ పక్కనున్న జిల్లాల నుంచి వచ్చే వెహికల్స్ ను సరిహద్దుల వద్దే నిలిపివేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 4 వరకు ప్రయాగ్ రాజ్ సిటీలోకి ఫోర్ వీలర్ల ప్రవేశంపై నిషేధం విధించింది. కుంభమేళాలో భక్తుల సౌకర్యార్థం వన్-వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు యూపీ సర్కార్ పేర్కొంది. ఇక చిరు వ్యాపారులు రోడ్లపై పెట్టుకున్న షాపులను వెంటనే ఖాళీ స్థలాల్లోకి తరలించాలని సర్కారు ఆదేశించింది. అలాగే కుంభమేళా ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాలని పోలీసు అధికారులకు యూపీ సర్కార్ స్పష్టం చేసింది. భక్తులు ఎక్కడా ఎక్కువ సేపు ఆగకుండా.. వారికి అర్థమయ్యే విధంగా ఎగ్జిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపింది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులను కూడా యూపీ ప్రభుత్వం ఆదేశించింది.
27.58 కోట్లకు చేరిన భక్తుల సంఖ్య
మహాకుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 1.52 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని సర్కారు తెలిపింది. దీంతో మహాకుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 27.58 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 3న వసంత పంచమి స్నాన్ జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3న భారీ సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాలు ఉన్నాయి. దాంతో కుంభమేళా ఏరియాలో పోలీసు సిబ్బంది, భద్రతా బలగాల మోహరింపును మరింత పటిష్టం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
మళ్లీ అక్కడే అగ్నిప్రమాదం
మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లోని ఝూన్సీ ఛత్నాగ్ ఘాట్, నాగేశ్వర్ ఘాట్ సమీపంలో టెంట్లకు మంటలు అంటుకున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భక్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు. వందల మంది ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ నెల19వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. పది రోజుల గ్యాప్ లో.. అక్కడే మళ్లీ టెంట్లు మంటల్లో తగలబడటం చర్చనీయాంశం అయింది.