వెతకండయ్యా.. వెతకండీ : నా చిలకను పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తా

వెతకండయ్యా.. వెతకండీ : నా చిలకను పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తా

మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధం విడదీయలేనిది. పెంపుడు జంతువులు.. పక్షులను కొందరు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. పెట్స్ ను ఇంట్లో మనిషిలాగా పెంచుకుంటారు. ఒక్కపూట వాటితో గడపకుంటే ఆ రోజు ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. కొందరైతే తిండి కూడా మానేస్తారు. మరి అంత ప్రేమతో పెంచుకున్న పెట్స్ మిస్సయితే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది.  ఏం చేసైనా, ఎంత ఖర్చు పెట్టి అయినా సరే దొరికించుకోవాలి.. అనే వాళ్లు ఎందరో ఉంటారు. అచ్చం అలాంటి స్టోరే ఇప్పుడు మనం చదువుతున్నాం. తన పెట్ పోయిందని నిద్రాహారాలు మానేసి.. పట్టిచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించాడు ఆ వ్యక్తి. ఎంత సహృదయుడో కదా.

ఉత్తరప్రదేశ్ లోని బులంద్ శహర్ కు చెందిన నవీన్ పాఠక్ తన చిలుకను తెచ్చి ఇచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ‘విష్ణు’ అని ముద్దుగా పిలుచుకునే తన చిలుక డిసెంబర్ 10 నుండి కనబడకుండా పోయిందట. చుట్టు పక్కల ఎక్కడ వెతికినా దొరకలేదంట. విష్ణు దొరకకపోవడంతో ఇంట్లో పిల్లలతో పాటు కుటుంబం  మొత్తం ఆహారం మానేసిందట. దీంతో విష్ణు అనే తన చిలుకలను పట్టి తెచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు పాఠక్. 

ALSO READ | 'మదర్ ఆఫ్ ట్రీ' కన్నుమూత – లక్షల్లో మొక్కలు నాటిన 'తల్లి' మృతి

వైరల్గా మారిన విష్ణు స్టోరీ.. 

నవీన్ పాఠక్ లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించిన తర్వాత చిలుక ‘విష్ణు’ స్టోరీ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో విష్ణు స్టోరీ గురించి వెతకని వారు ఉండరంటే నమ్మండి. విష్ణు నవీన్ పాఠక్ ను కలిసిన స్టోరీ చాలా ఆసక్తిగా ఉంటుంది. రెండేళ్ల క్రితం చిలుక గాయపడి ఒక చోట పడి ఉంటే నవీన్ కాపాడాడట. చిలుక విష్ణుకు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత  ఇంట్లో మనిషిలాగ వారితో కలిసి పోయిందట. పిల్లలకు, పెద్దలకు అందరికీ విష్ణు దగ్గరైందట. విష్ణు ఎప్పుడూ అల్లరిగా అందరితో సరదాగ ఉండేదట. వాళ్లు ఏం  మాట్లాడితే అది మాట్లాడటానికి ప్రయత్నించేదట. నవీన్ ను ‘పాప్ప’ అని, అతని భార్యను ‘మమ్మీ’ అని పిలిచేదంట. ఇంతలా ఫ్యామిలీ మెంబర్ లా కలిసి పోవడంతోనే కావచ్చు.. విష్ణు తెచ్చి ఇచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటించింది ఆ ఫ్యామిలీ.