యూపీ బై పోల్స్: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం

యూపీ బై పోల్స్: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం

లక్నో: యూపీ అసెంబ్లీ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల (నవంబర్)లో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయొవద్దని ఆ పార్టీ డిసైడ్ అయ్యింది. ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సమాజ్‎వాదీ పార్టీకి మద్దతు ఇవ్వాలని హస్తం పార్టీ నిర్ణయించుకుంది. ఉపఎన్నికల్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి మద్దతు ఇస్తున్నట్లు యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే గురువారం (అక్టోబర్ 24) అధికారికంగా వెల్లడించారు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామ్యులైనప్పటికీ ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ వేర్వేరుగా బరిలోకి దిగాయి. 

ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విజయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఓట్ల చీలికతో ఖచ్చితంగా గెలుస్తామనుకున్న హర్యానాలో విజయం ముంగిట కాంగ్రెస్ బోల్తా కొట్టింది. ఈ ఎదురుదెబ్బతో యూపీ ఉపఎన్నికల్లో బరిలోకి దిగకుండా ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షమైన ఎస్పీకి సపోర్టు ఇవ్వాలని డిసైడ్ అయ్యిందని తెలుస్తోంది. మొదట ఈ తొమ్మిది స్థానాల్లో ఐదు చోట్ల పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించినట్లు ప్రచారం జరిగింది. కానీ హర్యానా ఫలితాల ప్రభావంతో యూపీ బైపోల్స్‎లో అభ్యర్థులను నిలబెట్టకుండా.. ఎస్పీ క్యాండిడేట్స్‎కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

ALSO READ | మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: మాజీ సీఎం శరద్ పవార్‎కు బిగ్ షాక్

కాగా, యూపీలోని కతేహరి, కర్హల్, మీరాపూర్, ఘజియాబాద్, మజ్హవాన్, సిసమావు, ఖైర్, ఫుల్పూర్, కుందర్కి అనే తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఈ తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు నవంబర్ 13న ఉప ఎన్నికలు నిర్వహించి, నవంబర్ 23న ఫలితాలు వెల్లడించునన్నట్లు ఈసీ ప్రకటించింది. కర్హల్, సిసామౌ, ఫుల్‌పూర్, మిల్కిపూర్, కతేహరి, మజాహవాన్, మీరాపూర్‌ స్థానాలకు ఎస్పీ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్ రేస్ నుండి తప్పుకోవడంతో మిగిలిన స్థానాలకు త్వరలోనే ఎస్పీ అభ్యర్థులను ప్రకటించనుంది.