ఢిల్లీని చెత్తకుప్పలా మార్చారు:యోగి ఆదిత్యానాథ్

ఢిల్లీని చెత్తకుప్పలా మార్చారు:యోగి ఆదిత్యానాథ్
  • యమునా నదిలో కేజ్రీవాల్ స్నానం చేయగలరా?: యోగి ఆదిత్యనాథ్ 

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని ఆప్ ప్రభుత్వం చెత్తకుప్పలా మార్చిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఆ పార్టీ విఫలమైందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. 

‘‘ఆప్ ప్రభుత్వం ఢిల్లీని డంపింగ్‌‌ యార్డ్‌‌ లా చేసింది. యమునా నదిని మురికి కాలువగా మార్చింది. కుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల ప్రయాగ్‌‌రాజ్‌‌లో నేను పుణ్యస్నానం చేశా. ఇక్కడున్న యమునా నదిలో కేజ్రీవాల్‌‌ స్నానం చేయగలరా?  దీనికి ఆయన నైతికంగా సమాధానం చెప్పాలి’’ అని యోగి డిమాండ్ చేశారు. 

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కు మధ్య తేడాలను చెప్పారు. ‘‘యూపీలోని నోయిడా, ఘజియాబాద్ రోడ్లు ఢిల్లీతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఢిల్లీలో మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. నీటి కొరత ఢిల్లీ ప్రజలను వేధిస్తోంది. సర్కారు 24 గంటల విద్యుత్‌‌ సరఫరా చేయలేకపోతోంది” అని విమర్శించారు.