కుంభమేళాలో యూపీ కేబినెట్ పుణ్య స్నానం

కుంభమేళాలో యూపీ కేబినెట్ పుణ్య స్నానం
  • త్రివేణి సంగమంలో సీఎం యోగి ప్రత్యేక పూజలు

మహాకుంభనగర్ (యూపీ): మహా కుంభమేళాలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్​తో పాటు మంత్రులంతా త్రివేణి సంగమంలో బుధవారం మధ్యాహ్నం పుణ్య స్నానాలు ఆచరించారు. దీనికి ముందు గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలు, చీర సమర్పించారు. అనంతరం సూర్య భగవానుడికి గంగాజలం సమర్పించి పుణ్య స్నానాలు చేశారు. కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సీఎం యోగి ఆదిత్యనాథ్ చుట్టూ మంత్రులు నిలబడి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన బోటులో అందరూ కొద్దిసేపు ఆనందంగా గడిపారు. వలస పక్షులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దాణా తినిపించారు. మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఆజాద్ అన్సారి, అప్నా దళ్ (ఎస్) నుంచి మంత్రి అశీష్ పటేల్, బల్​దేవ్, ఫిషరీస్ మినిస్టర్ సంజయ్ నిషాద్​తో పాటు మొత్తం 54 మంది మంత్రులు పుణ్య స్నానాలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మొత్తం కేబినెట్ రాకతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.

ప్రయాగ్​రాజ్​లో కేబినెట్ భేటీ

పుణ్య స్నానాలకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. కీలకమైన ప్రతిపాదనలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించింది. భేటీ అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియాకు కేబినెట్ నిర్ణయాలు వెల్లడించారు.

10 కోట్ల మంది పుణ్య స్నానాలు

మహాకుంభ మేళాలో భాగంగా ఇప్పటి వరకు 10 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం సుమారు 60‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్లు వివరించారు.