
- రూ.3 లక్షల కోట్లు పెరుగుతది
- సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి
- కొనసాగుతున్న రద్దీ.. 56.25 కోట్లు దాటిన భక్తులు
లక్నో/ప్రయాగ్ రాజ్: మహాకుంభమేళాతో యూపీ ఎకానమీ రూ.3 లక్షల కోట్ల మేరకు పెరుగుతుందని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కుంభమేళా విజయవంతంగా సాగుతున్నదని, ఇప్పటికే 56.25 కోట్ల మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడారు.
కుంభమేళాపై వస్తున్న వదంతులను నమ్మరాదని కోరారు. మేళాపై దుష్ప్రచారం చేయడమంటే సనాతన ధర్మంతో ఆడుకున్నట్లే అని పేర్కొన్నారు. ‘‘నేడు యూపీ శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచం చూస్తున్నది. అందుకు గత కొద్ది రోజులుగా మా సర్కారు విజయవంతంగా నిర్వహిస్తున్న మహాకుంభమేళాయే నిదర్శనం” అని యోగి పేర్కొన్నారు. కాగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ శుక్రవారం ప్రయాగ్ రాజ్ వద్ద త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాట్లను అద్భుతంగా చేసిందంటూ థ్యాంక్స్ చెప్పారు.
మహాశివరాత్రికి భారీగా ఏర్పాట్లు
ఈ నెల 26న మహాశివరాత్రి నాడు మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భక్తుల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
జైలులోనే ఖైదీల పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా జైలులో ఖైదీలు శుక్రవారం మహాకుంభమేళా నుంచి తెప్పించిన నీటితో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రయాగ్ రాజ్ వద్ద త్రివేణీ సంగమం నుంచి తెప్పించిన నీటితో జైలులోనే ఖైదీలు స్నానాలు చేశారు. రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉంటున్న ఖైదీలకు కూడా మహాకుంభమేళా నీటితో స్నానాలు చేసేందుకు అధికారులు
ఏర్పాట్లు చేస్తున్నారు.
డిజిటల్ స్నానం.. పైసా వసూల్
కుంభమేళాలో పాల్గొనలేకపోతున్న వారి కోసం ప్రయాగ్ రాజ్ కు చెందిన ఓ యువకుడు కొత్త ఐడియా ఇచ్చాడు. మేళాకు రాలేకపోతున్న వారు ఫొటోలను వాట్సాప్ లో పంపితే, వాటిని ప్రింట్ తీసి త్రివేణీ సంగమంలో ముంచి ‘డిజిటల్ స్నానం’ చేయిస్తానని ఆఫర్ చేశాడు. ఇందుకు రూ.1,100 చార్జి చేస్తున్నాడు. దీనికి సంబంధించి అతడు సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే, కుంభమేళాలో ఇదేం దోపిడీ? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.