విశ్లేషణ:ఉత్తరప్రదేశ్​లో  టఫ్ ఫైట్?

విశ్లేషణ:ఉత్తరప్రదేశ్​లో  టఫ్ ఫైట్?

2022 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్​సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ లిస్ట్​లో ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా ఉన్నా దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం. అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపైనే ఢిల్లీలో పవర్ ఎవరిదనేది డిసైడ్​ అవుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచే 80 మంది ఎంపీలు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా వారణాసి నుంచే ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో గెలవాలంటే ఉత్తరప్రదేశ్​ను తిరిగి చేజిక్కించుకోవడం బీజేపీకి చాలా అవసరం. అయితే ప్రస్తుతం యూపీలో అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నందున టఫ్​ ఫైట్​ తప్పకపోవచ్చని పొలిటికల్​ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్​లో 1990 తర్వాత ఏ ప్రభుత్వం కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. ములాయం సింగ్​ యాదవ్ 2002 నుంచి 2007 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాయావతి 2007 నుంచి 2012 వరకు సీఎం పోస్టులో ఉన్నారు. 2012 నుంచి 2017 వరకు అఖిలేశ్​ యాదవ్​ సీఎం పదవిలో కొనసాగారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఐదేండ్ల కాలం పూర్తి చేసుకోనుంది. 2019 పార్లమెంట్​ ఎలక్షన్ల తర్వాత, ఉత్తరప్రదేశ్​లో నరేంద్రమోడీ సులువుగా గెలుపొందుతారని అందరూ అంచనా వేశారు. కానీ, జీవితం అంచనాలకు అందనిది. శతాబ్ద కాలానికి ఒకసారి వచ్చే మహమ్మారి లాంటి కరోనా వైరస్​ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఎన్నో లక్షల ప్రాణాలను హరించేసింది. ఇప్పటికీ ప్రతి ఒక్కరినీ తీవ్రంగా వణికిస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో చైనా అడుగులు కూడా అంచనాలకు అందనివే. ఈ నేపథ్యంలో వచ్చిన యూపీ ఎన్నికలు అన్ని పార్టీలకూ కీలకంగా మారాయి.

ఢిల్లీకి.. యూపీకి లింక్
1990కి ముందు కాంగ్రెస్​ పార్టీ వరుసగా అధికారంలో కొనసాగింది. ఎందుకంటే అప్పట్లో కేంద్రంలో కూడా ఆ పార్టీనే అధికారంలోనే ఉండేది. 1998లో వాజ్​పేయి ప్రధానమంత్రి అయ్యే నాటికి ఉత్తరప్రదేశ్​లో కల్యాణ్​సింగ్​ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. దీనిని బట్టి ఢిల్లీలో పవర్ కు ఉత్తరప్రదేశ్​లో అధికారానికి లింక్​ ఉందని అర్థమవుతుంది. ప్రస్తుతం బీజేపీ, రెండు ప్రాంతీయ పార్టీలే ఉత్తరప్రదేశ్​ రాజకీయాలను శాసిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెస్​ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చివరికి 2019లో రాహుల్​గాంధీ కూడా తన అమేథి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. దీంతో ప్రస్తుతం అక్కడ బీజేపీ వర్సెస్ రీజినల్​ పార్టీలు అన్నట్టుగానే పోరు నడవనుంది. ఉత్తరప్రదేశ్​లోని మొత్తం ఓటర్లలో మైనార్టీల సంఖ్య 25 శాతానికిపైగా ఉంటుంది. వారంతా పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా లేదా బీజేపీని ఓడిస్తారనుకునే అభ్యర్థికి ఓటు వేస్తారు. ఉత్తరప్రదేశ్​లో కులం, మతం కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ, మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి, సుపరిపాలనను జత చేసి తమ ప్రజాదరణను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. 

యూపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు
సమాజ్​వాదీ పార్టీ లీడర్​ అఖిలేశ్​ యాదవ్​ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా మారారు. అంటే 25 శాతం ఉన్న మైనార్టీ ఓట్లలో ఎక్కువ శాతం ఆయనకు మళ్లే అవకాశం ఉంది. ఇది అఖిలేశ్​ యాదవ్​కు కలిసొచ్చే గొప్ప సానుకూలాంశం. అయితే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటింది. కౌంటర్ ​పోలరైజేషన్​ కింద హిందువులు అఖిలేశ్​కు దూరమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. ఓటుబ్యాంకు రాజకీయాలను వ్యతిరేకించే వారు కూడా దూరమయ్యే చాన్స్​ ఉంది. వీరు బీజేపీకి ఓటు వేయవచ్చు. ముఖ్యమంత్రిగా ఫెయిలైన రికార్డు కూడా అఖిలేశ్​కు ఉంది. అన్ని ప్రధాన పార్టీలు ఎలాంటి మిత్రపక్షాలు లేకుండానే పోటీ చేస్తున్నాయి. కూటమిగా ఏర్పడటం వల్ల ప్రయోజనం కనిపించడం లేదని, ఓట్​ ట్రాన్స్​ఫర్​ కూడా సరిగ్గా జరగడం లేదనే అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మైనార్టీలు కాని వారి  రెండో ప్రాధాన్యత బీజేపీనే కావడం. ఒకవేళ ఒక కాంగ్రెస్​ ఓటర్​ తన పార్టీ ఎన్నికల్లో గెలుపొందదని భావిస్తే, అతను తన ఓటును బీజేపీకి ట్రాన్స్​ఫర్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నార్త్​ ఇండియాలో ‘ముందు మతం, ఆ తర్వాతే కులం’ అనే అంశం కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ మైనార్టీలు అఖిలేశ్​ యాదవ్​కు మద్దతుగా ఒక్కటైతే, అప్పుడు బీజేపీకి అనుకూలంగా కౌంటర్ పోలరైజేషన్​ జరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. 2014 ఎన్నికల టైంలో ఇదే జరిగింది. అప్పుడు సోనియాగాంధీ సోషల్​ ఇంజనీరింగ్​ పేరిట పెద్ద కులాలు, రైతులను పక్కనపెట్టారు. దీంతో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా భారీగా కౌంటర్​ పోలరైజేషన్​ జరిగి ఆ పార్టీ దెబ్బతింది. ఉత్తరప్రదేశ్​లో మార్పు అనే అంశం తెరపైకి రావడం లేదు. ఎందుకంటే అఖిలేశ్​ యాదవ్, మాయావతి, యోగి ఆదిత్యనాథ్.. ఇలా అందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. అఖిలేశ్​కు ఎదురయ్యే సమస్య ఏమిటంటే.. ముఖ్యమంత్రిగా ఆయన అతిపెద్ద ఫెయిల్యూర్. మాయావతి విషయానికి వస్తే.. ఆమె ప్రజాదరణ అంతకంతకూ తగ్గిపోతోంది. దళిత ఓటర్లు కూడా మాయావతి కంటే బీజేపీ వైపే మొగ్గుచుపుతున్నారు.

కాంగ్రెస్​ పార్టీ ఉత్తరప్రదేశ్​లోని మొత్తం 403 సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడమే దీనికి కారణం. కాంగ్రెస్​ ఎక్కువ సీట్లు గెలుపొందకపోయినా, ఆ పార్టీ చీల్చే ఓట్ల వల్ల అభిలేశ్​ యాదవ్​పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు ప్రియాంకాగాంధీ వాద్రా గురించి చాలా ఎక్కువగా చర్చ జరుగుతోంది. కానీ, అక్కడ ఎలాంటి గ్రౌండ్​ వర్క్ మాత్రం నడవడం లేదు. ఇండియన్​ పాలిటిక్స్​లో ఒక రూల్​ ఉంది. రీజినల్​ పార్టీల డామినేషన్​ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ కాంగ్రెస్​ పార్టీ పూర్తిగా బలహీనపడుతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్​ అందుకు మంచి ఉదాహరణలు.

బీజేపీకి యూపీ ఎంతో కీలకం..
ఒకవేళ ఉత్తరప్రదేశ్​లో బీజేపీ ఓటమి పాలైతే, ఇండియాలోనే అతి పెద్ద రాష్ట్రంలో మోడీ ఓడిపోయాడని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. బీజేపీ మొత్తం వ్యూహాలన్నీ తప్పు అని కూడా ఈ ఓటమి తెలియజెప్పుతుంది. అలాగే యూపీ ఓటమి ప్రతిపక్షాలకు ధైర్యాన్ని ఇస్తే, బీజేపీని మానసికంగా దెబ్బతీయవచ్చు. వాస్తవానికి, ఉత్తరప్రదేశ్​లో బీజేపీ ఓటమిపాలైనా దానిని 2024లో ఆ పార్టీ ఓటమిపాలైనట్టు కాదు. కానీ, ఈ ఓటమి దేశాన్ని ముందుకు నడిపించడంలో బీజేపీ సమస్యలు సృష్టించవచ్చు. నిజం చెప్పాలంటే, ఉత్తరప్రదేశ్​ లో ఎన్నికల యుద్ధం నరేంద్రమోడీకి, కనిపించని శత్రువు కరోనా వైరస్​కు మధ్య జరగనుంది. ఎందుకంటే కరోనా మోడీ ప్లాన్లన్నింటినీ దెబ్బ తీసింది. ఒకవేళ ఉత్తరప్రదేశ్​లో బీజేపీ కనుక ఓటమిపాలైతే.. దేశంలోని రెండు అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ ప్రతిపక్ష ప్రభుత్వాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

రెండో టర్మ్​ పవర్​లోకి వస్తదా?
2024లో విజయం సాధించాలంటే యూపీలో విజయం తనకు అవసరమని మోడీ ఓపెన్​ గానే చెప్పారు. బలమైన పాలకుడిగా పేరు తెచ్చుకున్నా యోగి చేసిన తప్పు ఏమిటంటే తన మాటలతో అనవసర వివాదాలను కొని తెచ్చుకోవడం. ఈ విషయంలో యోగి.. అమెరికా మాజీ ప్రెసిడెంట్​ రూజ్​వెల్ట్ చెప్పిన మాటలను గుర్తుతెచ్చుకోవాలి. ‘మృదువుగా మాట్లాడండి, కానీ పెద్ద కర్రను తీసుకెళ్లండి’ అని రూజ్​వెల్ట్ చెప్పారు. మృదువుగా మాట్లాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మీ శత్రువులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. అప్పుడు మీరు విజయం సాధిస్తారు. కానీ, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్​లో బీజేపీ టఫ్​ ఫైట్​ను ఎదుర్కొంటోంది. ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. 1989 తర్వాత ఏర్పాటైన ఏ ఉత్తరప్రదేశ్​ గవర్నమెంట్​ కూడా రెండో టర్మ్​ పవర్​లోకి రాలేదు. 

బీజేపీకి ఉన్న అవకాశాలు..
సాధారణ పరిస్థితుల్లో అయితే యూపీలో బీజేపీ ఈజీగా గెలవాలి. కానీ, కరోనా సెకండ్​ వేవ్​ బీజేపీ అవకాశాలను ప్రభావితం చేసింది. నోట్ల రద్దు కూడా ఎకానమీని నెమ్మదించేలా చేసింది. ఇవే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే నెగెటివ్​ ఫ్యాక్టర్స్. అయితే యూపీ అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆ దిశగా అడుగులు వేస్తోంది. మాఫియాను కూకటివేళ్లతో పెకిలించివేసిన యోగి ఆదిత్యనాథ్​ కూడా బలమైన పాలకుడిగా జనంలో పేరు సంపాదించారు. నరేంద్రమోడీ, యోగి ఆదిత్యనాథ్​ మహిళలు, చిన్నారులతో సమావేశాలను మొదలుపెట్టారు. దీని ద్వారా తమలోని సున్నిత, భావోద్వేగ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు ఎక్కువగా నరేంద్ర మోడీని ఇష్టపడవచ్చు. ఎందుకంటే భాష, శైలి ఆయనతో వారిని కనెక్ట్​ అయ్యేలా చేయవచ్చు. ప్రస్తుతం మనదేశంలో, జాతీయ భద్రత, జాతీయవాదం కోసం ఓటు వేసే ప్రజల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినట్లే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ఆ వర్గం పూర్తిగా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. 

- పెంటపాటి పుల్లారావు, సోషల్​ ఎనలిస్ట్