తెలంగాణ నుంచి బీజేపీని తరిమికొట్టండి : అఖిలేష్ యాదవ్

ఖమ్మం బీఆర్ఎస్ ఆవర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడిన అఖిలేష్.. మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కూర్చొని ఒక్కో రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని తరిమికొట్టే ఉద్యమం తెలంగాణ నుంచే నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయన్న అఖిలేష్.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గద్దెదించడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలను కేంద్రం కాపీ కొడుతోందని విమర్శించారు.

దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్న మోడీ సర్కారు విపక్ష నేతలను ముప్పు తిప్పలు పెడుతోందని అఖిలేష్ విమర్శించారు. కేంద్రం తీరుతో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశం వెనక్కిపోతోందని అభిప్రాయపడ్డారు.  బీజేపీ జీ 20 మీటింగ్ ను సైతం ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుందని అఖిలేష్ సటైర్ వేశారు. తెలంగాణలో బీజేపీని తరిమికొడితే ఆ తర్వాత యూపీ నుంచి ఆ పార్టీని సాగనంపుదామని అన్నారు.