- ఉజ్జయినిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- దుబే అనుచరుల్లో మరో ఇద్దరు ఎన్‌కౌంటర్
- ఇప్పటికి ఐదుగురిని మట్టుబెట్టిన పోలీసులు
ఉజ్జయిని/కాన్పూర్: 8 మంది పోలీసుల హత్య కేసు, మరో 60 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడు వికాస్ దుబేను ఎట్టకేలకు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారం రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న దుబేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అదుపులోకి తీసుకున్నారు. మాస్క్‌లో ఉన్నవికాస్ దుబేను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుట్‌జ్‌లు బయటికి వచ్చాయి. గురువారం ఉదయం ఉజ్జయిని గుడికి వచ్చిన దుబేను ఒక షాపు యజమాని గుర్తుపట్టి పోలీసులను ఎలర్ట్ చేశాడు. ఎలర్ట్ అయిన సెక్యూరిటీ దుబేను ఐడీ అడగగా ఫేక్ ఐడీ కార్డ్ ఇచ్చాడు. అంతే కాకుండా సెక్యూరిటీతో గొడవకు దిగాడు. దీంతో దుబేను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ పోలీసులకు అప్పజెప్పారు. 60 కేసుల్లో నిందితుడైన దుబేను అదుపులోకి తీసుకునేందుకు అతని గ్రామానికి వెళ్లిన పోలీసులపై దుబే, అతని 15 మంది అనుచరులపై పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి దుబే, అతని అనుచరులు తప్పించుకుని తిరుగుతున్నారు. దుబేపై యూపీ ప్రభుత్వం రూ.5లక్షలు రివార్డు కూడా ప్రకటించింది. దాదాపు 40 టీమ్‌లు మూడు రాష్ట్రాల్లో దుబే కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన అనుచరుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు ముఖ్య అనుచరులు ఎన్‌కౌంటర్
వికాస్ అనుచరుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దుబే అనుచరుల్లో ఐదుగురుని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బుధవారం తెల్లవారుజామున దుబే ముఖ్య అనుచరుడు అమర్ దుబేను ఎన్‌కౌంటర్ చేశారు. గురువారం మరో ఇద్దరు అనుచరులను ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రభాత మిశ్రా, ప్రవీణ్ దుబే చనిపోయారన్నారు. కారు దొంగలించి పారిపోతున్న ప్రవీణ్ దుబేను కాల్చిచంపినట్లు అధికారులు చెప్పారు. మిశ్రాను హరియాణాలోని ఫరీదాబాద్‌లో అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో అతడిని కాల్చి చంపేసినట్లు చెప్పారు. “ పోలీస్ ఎస్కార్ట్ వెహికిల్ పంక్చర్ అయింది. టైర్ మారుస్తుండగా మిశ్రా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పాన్కీ దగ్గర అతనిపై కాల్పులు జరపడంతో చనిపోయాడు” అని లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ అన్నారు. మిశ్రా పోలీసుల దగ్గర నుంచి లాకున్న 9ఎమ్‌ఎమ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపిన 15 మందిలో మిశ్రా, దుబే నిందితులు. వారిపూ రూ.50వేలు రివార్డు ఉంది.