- సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం
- ప్రభుత్వ స్కీంలను ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్
- ప్రతి నెలా రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షలు పొందే చాన్స్
- అశ్లీల, పరువుకు భంగం కలిగించే కంటెంట్ పెడితే క్రిమినల్ కేసులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారికి గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడనుంది. దేశానికి వ్యతిరేకమైన, అశ్లీలతతో కూడిన లేదా ఇతరుల పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికలపై పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన కొత్త సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పాలసీలో పేర్కొన్న ప్రకారం.. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికలపై అభ్యంతరకర కంటెంట్ పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడాన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. దీనికి జరిమానాతోపాటు కనిష్టంగా మూడేండ్ల నుంచి గరిష్టంగా జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 66ఈ, సెక్షన్ 66ఎఫ్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. యూపీలో ఇకపై కొత్త పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
ఇన్ఫ్లుయెన్సర్లకు భారీ ఆఫర్
సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రకటన లు, వీడియోలు, ట్వీట్లు, పోస్టులు, రీల్స్ వంటి వాటి నిర్వహణకు ప్రత్యేకంగా ‘వీ ఫామ్’ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయా లని పాలసీలో పేర్కొన్నారు. ప్రభుత్వ స్కీంలు, కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఇన్ ఫ్లుయెన్సర్లకు భారీగా డబ్బులు కూడా ముట్టజెప్పాలని నిర్ణయించారు. ఎక్స్‌లో సర్కారు స్కీంలను ప్రచారం చేసే ఇన్ ఫ్లుయెన్సర్లకు గరిష్ఠంగా రూ. 5 లక్షలు, ఫేస్ బుక్ లో అయితే రూ. 4 లక్షలు, ఇన్ స్టాగ్రామ్ లో అయితే రూ. 3 లక్షలు ప్రతి నెలా సర్కారు చెల్లించనుంది.