హత్రాస్ తొక్కిసలాట ఘటనలోభోలే బాబాకు క్లీన్ చిట్

హత్రాస్ తొక్కిసలాట ఘటనలోభోలే బాబాకు క్లీన్ చిట్
  • పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తేల్చిన జ్యుడీషియల్ కమిషన్

లక్నో: గత ఏడాది దేశాన్ని కుదిపేసిన హత్రాస్ తొక్కిసలాట ఘటనలో జ్యుడీషియల్ కమిషన్ భోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చింది. పోలీసుల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణమని కమిషన్ తేల్చింది. 2024 జులై 2న ఉత్తరప్రదేశ్​లోని హత్రాస్‌ జిల్లా ఫులారి గ్రామంలో భోలే బాబా ఆధ్వర్వంలో సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవలం 80 వేల మంది హాజరు కావడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ, రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. 

కార్యక్రమం అనంతరం భోలే బాబా వెళ్లిపోతుండగా.. ఆయన పాదాలను తాకి.. పాదాల కింది మట్టిని తీసుకొనేందుకు భక్తులు పరుగెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి ఊపిరి ఆడక 121 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 112 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం జరిగిన ఒక రోజు తర్వాత.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 

తొక్కిసలాటలో కుట్ర కోణాలను పరిశీలిస్తూ, ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణ అంనతరం తొక్కిసలాటకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని జ్యుడీషియల్ కమిషన్ తేల్చింది. భోలే బాబాతో పాటు ఇద్దరు ఈవెంట్ నిర్వాహకులకూ క్లీన్​చీట్​ఇస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.