- ఇప్పటికే ఆదేశాలిచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు వెయ్యిలోపు, తర్వాత వెయ్యికిపైగా పెరిగిన కేసులు.. ఇప్పుడు ఏకంగా రెండు వేలు దాటాయి. ఆదివారంతో పొలిస్తే సోమవారం కేసుల సంఖ్య దాదాపు 90% పెరిగింది. మరణాలు కూడా రెండొందలు దాటాయి. తాజాగా ఒక్కరోజులో 2,183 మందికి కరోనా సోకిందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.30 కోట్లకు పైగా పెరిగాయి. గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 212 మరణాలు కేరళలో రికార్డయ్యాయి. మరణాల సంఖ్యను సవరించడంతో ఈ సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.76%గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.31% నుంచి 0.83 %నికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.32%, డెత్ రేటు 1.21%గా ఉంది. యాక్టివ్ కేసుల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది. ఆదివారం 11,558 యాక్టివ్ కేసులు ఉండగా, సోమవారం ఆ సంఖ్య 11,542కు తగ్గింది. వైరస్ నుంచి ఇప్పటివరకు 4.25 కోట్ల మందికిపైగా కోలుకున్నారు.
కేసుల సంఖ్య తగ్గడంతో దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం కూడా కరోనా రూల్స్‌ను అమలు చేయడం లేదు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు మాస్కులు ధరించాలని కోరుతున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో మాస్క్‌ను కంపల్సరీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని లక్నోతో పాటు ఢిల్లీకి సరిహద్దులో ఉన్న 6 జిల్లాల ప్రజలు కచ్చితంగా మాస్క్‌ను ధరించాలని చెప్పింది. ఢిల్లీ సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయని, దీంతో ప్రజలందరూ మాస్క్‌ను ధరించాలని సీఎం యోగి సూచించారు.