పేపర్ల ప్యాకెట్ పోయిందని.. కట్టేసి.. రాడ్ తో కొట్టి చంపారు

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో యజమాని ఆదేశాల మేరకు 32 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి బయట పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనలో  ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తిని శివమ్ జోహ్రీ మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఈ వైరల్ అయిన వీడియోలో ఓ వ్యక్తి శివంను రాడ్‌తో పదే పదే కొడుతున్నాడు. శివం నొప్పితో అరుస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. దొంగతనం ఆరోపణల నేపథ్యంలోనే శివంపై ఈ దాడి జరిగినట్టు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శివమ్ మృతదేహాన్ని ఏప్రిల్ 11న రాత్రి వైద్య కళాశాల, ఆసుపత్రిలో వదిలివేయగా.. శివం విద్యుదాఘాతంతో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత శివం డెడ్ బాడీని పరిశీలించిన పోలీసులు.. అతని శరీరంపై ఉన్న గాయాలను బట్టి చూస్తే అది విద్యుదాఘాతం వల్ల కాదని అనుమానం వచ్చి, దర్యాప్తు ప్రారంభించారు.

ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి బంకిం సూరితో గత ఏడేళ్లుగా శివమ్ పనిచేస్తున్నట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలింది. ఇటీవల ప్రముఖ వ్యాపారమైన కన్హియా హోజరీ ప్యాకేజీ కనిపించకుండా పోయింది. దొంగతనం చేశారనే అనుమానంతో పలువురు ట్రాన్స్‌పోర్టర్లు ఉద్యోగులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఈ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న ఏడుగురిలో కన్హియా హోసిరీ యజమాని నీరజ్ గుప్తా కూడా ఉన్నారు. కన్హియా హోసిరీ ప్రాంగణంలో ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది శివం హత్య కేసుతో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.