
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఇటీవల ఓ భర్త తన భార్యకు మళ్లీ పెళ్లి చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. భర్త తీసుకున్న నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తే.. మరికొందరు విమర్శించారు నెటిజన్లు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లి చేసిన మూడు రోజులకే తన భార్యను తిరిగి తీసుకొచ్చేశాడు ఆ భర్త.
అసలేం జరిగిందంటే.. బబ్లూ తన పనుల కారణంగా తరచుగా భార్యకు దూరంగా ఉండేవాడు. ఆ సమయంలో అతని భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్‌తో సంబంధాన్ని పెంచుకుంది. ఆ సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఈ విషయం బబ్లూకు తెలియడంతో మరో ఆలోచన లేకుండా ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నాడు. మొదట కోర్టుకు వెళ్లి ఆ తర్వాత తన భార్య, ఆమె ప్రేమికుడి వివాహాన్ని మార్చి 25న ఘనంగా జరిపించాడు. ఇక వీడియోలో రాధిక వికాస్‌తో దండలు మార్చుకుంటూ కన్నీళ్లతో కనిపించింది. చాలా మంది గ్రామస్తులు వివాహానికి హాజరయ్యారు. కొంతమంది తన భార్య ఆనందం కోసం బబ్లూ చేసిన త్యాగాన్ని ప్రశంసించగా, మరికొందరు అతని నిర్ణయాన్ని విమర్శించారు.
అయితే ట్విస్ట్ ఏంటంటే? బబ్లూ పెళ్లి అయిన మూడు రోజులకే మార్చి 28న వికాస్ ఇంటికి వెళ్లాడు. తన ఇద్దరు పిల్లలను చూసుకోవడం ఒక్కడికి కష్టమవుతోందని..పిల్లలిద్దరు తరచూ అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నారని తన భార్య రాధికను తనతో పంపించాలని బతిమాలాడంట. వికాస్ కుటుంబం కూడా రాధికను తిరిగి బబ్లూతో పంపించడానికి ఒప్పుకున్నారు. రాధికను తన కొడుకు వికాస్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ..అయితే తన కొడుకు కోరిక కాదనలేకనే పెళ్లికి ఒప్పకున్నామని వికాస్ తల్లి చెప్పింది. తన ఇద్దరి పిల్లలను చూసి రాధికను పంపించడానికి ఒప్పుకున్నామని తెలిపింది. ప్రస్తుతం జిల్లాలోని ఓ ప్రాంతంలో బబ్లూ రాధిక ఉంటున్నారు.