
లక్నో: మటన్ ముక్కల కోసం పెళ్లిళ్లలో గొడవలు అయినా ఘటనలు ఎన్నో చూశాం. మూలుగ బొక్కల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న సన్నివేశాలు చూశాం. మటన్ ముక్కలు తక్కువ పడ్డాయని పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు చూశాం. తాజాగా.. ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి తరహా ఘటనే ఒకటి జరిగింది. అయితే.. ఇక్కడ మాత్రం వివాదం చెలరేగింది నాన్ వెజ్ కోసం కాదు. పన్నీరు కోసం. పన్నీరు కర్రీ అడిగినంత వేయలేదని ఓ వ్యక్తి ఏకంగా పెళ్లి మండపాన్ని వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ల తండ్రుతలతో పాటు మరో నలుగురు గాయపడ్డారు.
పోలీసులు వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లా హమీద్‌పూర్ గ్రామంలో శనివారం రాత్రి ఒక వివాహం జరిగింది. ఇరువర్గాల బంధువులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి తన మినీ బస్లో కొందరు పెళ్లివారిని తీసుకొచ్చాడు. బంధువులను పెళ్లి మండపం వద్ద దింపి భోజనం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ధర్మేంద్ర యాదవ్కు అడిగినంత పన్నీరు కర్రీ వేసేందుకు పెళ్లివారు నిరాకరించారు. తనకు అడిగినంత పన్నీరు వెయ్యకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన మినీ బస్ను నేరుగా తీసుకెళ్లి పెళ్లి మండపానికి ఢీకొట్టాడు ధర్మేంద్ర యాదవ్. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
►ALSO READ | మంగళసూత్రం, జంజంపై నిషేధం.. వివాదస్పదమైన రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ఎగ్జామ్
ఇందులో వధువరుల తండ్రులు కూడా ఉన్నారు. ఆరుగురినీ వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. శనివారం రాత్రి జరగాల్సిన వివాహం మరుసటి రోజు ఉదయం జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ను అరెస్టు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవడైనా ముక్కలు కోసం గొడవ పడగా చూశాం కానీ వీడేవడు పన్నీరు కోసం ఇంత రచ్చ చేశాడంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది.