
పాక్ యువతి వలలో పడ్డ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి
లక్నో: పాకిస్తాన్ ఇంటర్ -సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగిని యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. రవీంద్ర కుమార్ అనే ఉద్యోగి గగన్‌యాన్ అంతరిక్ష ప్రాజెక్ట్, మిలటరీ లాజిస్టిక్స్- డెలివరీ సహా రహస్య డేటాను పంచుకున్నాడని యూపీ ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి శుక్రవారం మీడియాకు తెలిపారు.
పాక్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న నేహాశర్మ(కోడ్ నేమ్).. రవీంద్ర కుమార్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైందని, అతని ఫోన్లో 'చందన్ స్టోర్ కీపర్ 2' పేరుతో ఆమె పేరు సేవ్ చేసుకున్నాడని తెలిపారు. వారి మధ్య పరిచయం ఏర్పడిన తర్వాత.. నేహ డబ్బులు ఇస్తానని ఆశ చూపడంతో రవీంద్ర కుమార్ వాట్సాప్ ద్వారా ఆమెకు డేటా లీక్ చేసినట్టు యూపీ ఏటీఎస్‌తో పాటు ఇతర ఏజెన్సీలకు హెచ్చరికలు అందాయని చౌదరి వెల్లడించారు.
ముందుగా తమ ఆగ్రా యూనిట్.. రవీంద్ర కుమార్‌ను ప్రాథమికంగా విచారించిందని, ఆ తరువాత మరింత వివరణాత్మక విచారణ కోసం అతన్ని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలించామని.. అక్కడ అతడు నేహాతో రక్షణ విషయాలకు సంబంధించిన సమాచారంతో పాటు అతను పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రోజువారీ ప్రొడక్షన్ రిపోర్టులు, అభ్యర్థన వివరాలు పంచుకున్నట్టు వెల్లడించాడని ఆయన తెలిపారు. దీంతో అన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇతర రక్షణ సంబంధిత సంస్థలలో అన్ని స్థాయిల ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.