
అతనొక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి.. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన, రహస్యమైన సమాచారంతో డీల్ చేసే శాఖ అది. అంతటి సెన్సిటివ్ డిపార్ట్మెంట్ లో పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి..దేశ భద్రత కోసం కుటుంబాన్ని సైతం పెట్టేంత బాధ్యత, నిబద్దతతో పని చేయాల్సింది పోయి... ఒక అమ్మాయి మోజులో పడి.. దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని షేర్ చేశాడు. ఎట్టకేలకు ఈ విషయం బయటపడటంతో జైలుకెళ్ళాడు సదరు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ALSO READ | పంజాబ్ శివసేన కీలక నేత మంగత్ రాయ్ దారుణ హత్య
రవీంద్ర కుమార్ హజరత్ పూర్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఛార్జ్ మెన్ గా పని చేస్తున్నారు.అతనికి నేహా శర్మ అనే అమ్మాయి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. నేహా శర్మ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా పని చేస్తోంది. వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది... నేహా శర్మ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అని తెలిసి కూడా ఆమె మాయలో పడ్డ రవీంద్ర కుమార్.. ఇండియాకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నేహాకు ఫేస్బుక్ లో షేర్ చేశాడు.
ఈ విషయం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి తెలియడంతో మార్చి 12న రవీంద్ర కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుండి రూ. 6వేలు నగదు, ఎస్బీఐ డెబిట్ కార్డు, రెండు పోస్ట్ ఆఫీస్ డెబిట్ కార్డ్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు అధికారులు. రవీంద్ర కుమార్ డ్రోన్స్, గగన్ యాన్, వంటి కీలక రహస్య సమాచారం నేహా శర్మతో షేర్ చేసినట్లు గుర్తించారు అధికారులు.