హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారి.. ముస్లింల జుమ్మాలు 52...పోలీసు అధికారి వ్యాఖ్యలు వివాదాస్పదం..

హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారి.. ముస్లింల జుమ్మాలు 52...పోలీసు అధికారి వ్యాఖ్యలు  వివాదాస్పదం..

హోలీ పండుగ ఈ ఏడాది శుక్రవారం ( మార్చి 14)​వచ్చింది.  రంజాన్​ మాసం.. పైగా శుక్రవారం కావడంతో ముస్లింలు చాలా నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో యూపీ పోలీస్​ అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.   ఓ పక్క రంగులు జల్లుకోవడం.. మరోపక్క ముస్లిం సోదరుల శుక్రవారం నమాజ్​ .. ఈ క్రమంలో  ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉత్తరప్రదేశ్​ పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. 

హోలీ పండుగ.. రంజాన్​  నెలలో శుక్రవారం నమాజ్​ సందర్భంగాఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉత్తరప్రదేశ్​ లోని సంభాల్​ కొత్వాలి పోలీస్​ స్టేషన్​ లో సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి శాంతి సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారే వస్తుందని ... కాని ముస్లింలు శుక్రవారం చేసే ప్రార్థనలు 52 సార్లు వస్తాయన్నారు. హోలీ రంగులతో ఇబ్బందిపడే వారు ఇంట్లోనూ ఉండండంటూ.. బయటకు వచ్చేవారికి విశాల దృక్పథం కలిగి ఉండాలన్నారు.  భారతదేశంలో ప్రతి పండుగను అందరూ కలిసి జరుపుకోవాలని ఆయన సూచించారు. 

ముస్లింలు ఈద్​ కోసం ఎదురు చూసిన విధంగానే హిందువులు హోలీ కోసం ఎదురు చూస్తారంటూ.. ప్రజలు రంగులు పూసుకుంటూ ఆనందంగా ఉంటారని అన్నారు. ఈద్​ రోజున ముస్లింలు ప్రత్యేక వంటకాలు తింటే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని వేడుక చేసుకుంటారు. ఈ రెండు పండుగల సారాంశం ఒక్కటేనని.. పరస్పరం గౌరవించు కోవడమేనని అని ఆయన అన్నారు. 

ALSO READ | అమెరికా లిక్కర్ ‎పై 150 శాతం ట్యాక్స్ వేసిన మోడీ: వైట్ హౌస్‎కు దిమ్మతిరిగే షాక్

హోలీ వేడుకల్లో ఇష్టం లేని వారిపై రంగులు వేయొద్దని..  రెండు వర్గాల వారు మత విస్వాశాలను  గౌరవించాలంటూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హోలీ సంబరాలు జరుపుకోవాలని సంభాల్​ పోలీస్​ అధికారి అనుజ్​ చౌదరి సూచించారు.  శాంతి భద్రతలను కాపాడేందుకు పలు ప్రాంతాల్లో శాంతి కమిటీలు పర్యవేక్షిస్తాయన్నారు. 

అయితే పోలీసు అధికారి అనూజ్‌ చౌదరి వ్యాఖ్యలపై అటు ముస్లిం సంస్థలు , ఇటు సమాజ్‌వాదీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బీజేపీ ఏజంట్లుగా వ్యవహరించవద్దని   సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి శర్వేంద్ర బిక్రమ్ సింగ్ అన్నారు.  ప్రజలను రెచ్చగొట్టే విధంగా  వ్యాఖ్యలు చేసిన పోలీసు  అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పోలీసులు రాజకీయ ప్రకటనలు చేయడం మానుకోవాలని యూపీ కాంగ్రెస్ మీడియా కమిటీ వైస్ చైర్మన్ మనీష్ హింద్వీ సూచించారు.