ఆగ్రా: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల్లోని ఒక జాగను కొనుగోలు చేసిన ఉత్తరప్రదేశ్ వాసి హేమంత్ జైన్ 23 ఏండ్ల పోరాటం తర్వాత ముంబైలోని ఆ చోటుపై యాజమాన్య హక్కులు పొందారు. దావూద్ కబ్జా చేసిన ముంబైలోని జయరాజ్ భాయ్ స్ట్రీట్‌లోని 144 చదరపు అడుగుల దుకాణాన్ని 2001లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు వేలం వేశారు. దాన్ని రూ.2 లక్షలకు జైన్ దక్కించుకున్నారు.
అయితే, ఆస్తుల బదిలీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందంటూ అధికారులు.. దుకాణం యాజమాన్య హక్కులను జైన్ పేరిట బదిలీ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆ జాగపై హక్కుల కోసం హేమంత్ జైన్ సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చింది. ఆస్తులకు సంబంధించిన ఫైల్స్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అందుబాటులో లేకపోవడంతో ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
ఐటీ అధికారులు కూడా సహకరించలేదని జైన్ మీడియాకు తెలిపారు. వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలలో పీఎంవో ఆఫీస్‌ల చుట్టూ ఎన్నోసార్లు తిరిగానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానులకు లేఖలు రాశానని ఆయన గుర్తుచేశారు. ఆఖరికి 23 ఏండ్ల తర్వాత స్టాంప్ డ్యూటీ, పెనాల్టీల రూపంలో తాను రూ.1.5 లక్షలు చెల్లించాక ఈ ఏడాది డిసెంబర్ 19న ఆస్తి తన పేరుమీద రిజస్టర్ అయిందన్నారు. తొందరలోనే ముంబైకి వెళ్లి ఆ జాగను స్వాధీనం చేసుకుంటానని జైన్ తెలిపారు.