కళ్లెదుటే గుండెపోటుతో మహిళ అవస్థ..ఇన్​స్టా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టర్

కళ్లెదుటే గుండెపోటుతో మహిళ అవస్థ..ఇన్​స్టా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టర్
  • వైద్యం చేయాలని వేడుకున్న బాధితురాలి కొడుకుపై దాడి
  • రక్తం కక్కుకొని.. మహిళ మృతి 
  • యూపీలోని మెయిన్​పురిలో దారుణ ఘటన

మెయిన్‌‌పురి(యూపీ): క్రిటికల్ కండీషన్​లో వచ్చే రోగులను సైతం కాపాడేందుకు ఎంతో కష్టపడుతుంటారు డాక్టర్లు. అయితే ఓ కర్కశ డాక్టర్ మాత్రం కళ్ల ముందు గుండెపోటుతో ఒక ప్రాణం విలవిల్లాడుతుంటే... కనీసం పట్టించుకోకుండా రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ట్రీట్​మెంట్​ చేయమని వేడుకొన్న బాధితురాలి కొడుకుపై ఏకంగా దాడికి దిగాడు. వైద్యం అందక చాలా సేపు నరకయాతనపడి ప్రాణాలు కోల్పోయింది.

మంగళవారం మధ్యాహ్నం యూపీలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఉత్తర ప్రదేశ్(యూపీ) రాష్ట్రం మెయిన్‌‌పురి జిల్లాకు చెందిన 60 ఏండ్ల మహిళ ప్రవేశ్ కుమారికి గుండెపోటు వచ్చింది. గమనించిన ఆమె కొడుకు గురుశరణ్ సింగ్ వెంటనే మహారాజా తేజ్ సింగ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడి డాక్టర్లకు విషయం చెప్పి తన తల్లికి వైద్యం అందించాలని కోరాడు. నర్సులు, సిబ్బంది వెంటనే ఆమెను ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు.

అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆదర్శ్ సాంగర్ కుర్చీలో కూర్చుని మొబైల్ ఫోన్​లో ఇన్​స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ చూస్తున్నాడు. సమయం గడుస్తున్న కొద్ది తల్లి పరిస్థితి క్రిటికల్​గా మారుతుడడం.. డాక్టర్ ఇంకా రాకపోవడంతో గురుశరణ్ సింగ్ అక్కడి సిబ్బందిని ప్రశ్నించాడు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరంటూ నిలదీశాడు. ఫోన్‌‌లో రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న డాక్టర్ ఆదర్శ్ సాంగర్‌‌ను అక్కడి సిబ్బంది చూపించారు.

వెంటనే అతడు.. డాక్టర్ వద్దకు వెళ్లి తన తల్లి పరిస్థితి చెప్పి.. వెంటనే ట్రీట్​మెంట్ చేయాలని కోరాడు. డాక్టర్ ఆదర్శ్ రెస్పాడ్ అవకపోవడంతో ట్రీట్​మెంట్ ఎందుకు చేయరంటూ నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్ ఆదర్శ్.. గురుశరణ్ పై దాడి చేసి చెంపపై కొట్టాడు. అయినా  భరించి మళ్లీ డాక్టర్​ను బతిలాడాడు. కానీ డాక్టర్ మాత్రం అలాగే రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. ప్రవేశ్ కుమారి పరిస్థితి మరింత క్రిటికల్​గా మారి రక్తం కక్కుకుంది. గురుశరణ్ సింగ్, ఇతర బంధువులు ఆమె కాళ్లూ చేతులూ రాస్తూ వైద్యం చేయాలని వేడుకోవడంతో అక్కడునున్న నర్సింగ్ సిబ్బందికి వైద్యం చేయాలని డాక్టర్ సూచించారు.

వారు ట్రీట్​మెంట్ మొదలుపెట్టేసరికే ప్రవేశ్​కుమారి చనిపోయింది. డాక్టర్​ఆదర్శ్​నిర్లక్ష్యం వల్లే తన తల్లి ప్రాణాలు కోల్పోయిందని గురుశరణ్ సింగ్, ఆమె బంధువులు గొడవ చేశారు. ఆస్పత్రి వద్ద టెన్షన్ నెలకొనడంతో పోలీసులు అక్కడకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడికి చేరుకున్న ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మదన్ లాల్.. మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు చేపడతామని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని.. అక్కడి వారి నుంచి వివరాలు సేక రిస్తున్నామని.. డాక్టర్ ఆదర్శ్ సాంగర్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.