- రూ. 2- 50 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌డీలకు మాత్రమే
హైదరాబాద్, వెలుగు: ఏడాదికి 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేసే సూపర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) స్కీమ్ ను బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తీసుకొచ్చింది. బ్యాంక్ పాత, కొత్త కస్టమర్లు ఈ డిపాజిట్ స్కీమ్ కింద ఎఫ్‌డీ చేసుకోవచ్చు. కానీ, రూ. 2 కోట్ల నుంచి రూ.50 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ 175 రోజులు. ఈ నెల 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. సూపర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌కు, కార్పొరేట్‌లకు మంచి అవకాశం ఇస్తోందని, ఈ సంస్థలు తమ మిగులు నిధులను ఎఫ్‌డీ చేసి లాభాలు పొందొచ్చని ఎనలిస్టులు పేర్కొన్నారు.
షార్ట్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్లలో ఈ స్కీమ్ ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పారు. రిటైల్ డిపాజిట్లు (రూ.2 కోట్ల లోపు) చేసే 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు ఉన్న సీనియర్ సిటిజెన్స్ అదనంగా 0.50 శాతం వడ్డీని పొందొచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు గల ఎఫ్‌డీలపై ఈ వడ్డీ ఇస్తారు. అదే 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్స్ అయితే ఇవే రిటైల్ ఎఫ్‌డీలపై అదనంగా 0.65 శాతం వడ్డీ పొందొచ్చు. తాజాగా ఎస్‌బీఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్‌లు కూడా తమ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీ పెంచాయి. యాక్సిస్ బ్యాంక్ కూడా రూ.2 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీని మార్చింది.