
మహా కుంభమేళా.. 70 కోట్ల మంది జన సముద్రం.. పుణ్య స్నానాలు.. పవిత్రమైన ఈ కుంభమేళాకు వచ్చి వెయ్యి మంది వరకు తప్పి పోయారంట.. ఇప్పటికీ వాళ్ల ఆచూకీ లేదు.. ఎటు వెళ్లారు.. ఎటుపోయారు.. ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉందంట.. వాళ్ల దగ్గర సెల్ ఫోన్లు లేవా.. ఉంటే ఆ ఫోన్లు ఏమయ్యాయి.. అసలు వాళ్లు కుంభమేళా నుంచి ఎటుపోయారు అనేది మిస్టరీగా మారింది. ఇప్పటికే 869 మంది కుటుంబాలు.. తప్పిపోయిన భర్త, అన్న, చెల్లి, తమ్ముడు, మామ, తండ్రి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఇదంతా అఫిషియల్ రికార్డ్.. కంప్లయింట్స్ రానివి ఇంకెన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగిన మహా కుంభామేళా ముగిసింది. గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్లారు. కోట్ల మంది భక్తులు గంగ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. 2025, జనవరి 13న మొదలైన మహా కుంభ్.. 2025, ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది.
ఈ 45 రోజుల పాటు మహా కుంభ్ జరిగిన ప్రయాగ్ రాజ్ భక్తులతో కిటకిటలాడింది. ఎక్కడ చూసిన మనుషులే. ఇసుక వేస్తే రాలనంత జనంతో నెలన్నర రోజుల పాటు కుంభమేళా ప్రాంతం సందడిగా మారింది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతమంతా బోసిపోయింది. చెత్త చెదారం ఒకవైపు.. కుంభమేళాకు వచ్చి తప్పిపోయిన వారి పోస్టర్లతో నిండిపోయిన గోడలు మరోవైపు. కుంభమేళా కోట్ల కుటుంబాల్లో సంతోషం నింపగా.. అదే సమయంలో వేల కుటుంబాల్లో విషాదాన్ని కూడా మిగిల్చింది.
కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదాల్లో కొందరు.. కుంభమేళాకు వెళ్లాక తొక్కిసలాటలో ఇంకొందరు.. అనారోగ్యంతో మరికొందరు మృతి చెందటంతో ఆయా కుటుంబాల్లో పూడ్చలేని విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా.. కుంభమేళా ఇంకొన్ని కుటుంబాల్లో గందరగోళం క్రియేట్ చేసింది. ఇందుకు కారణం కుంభమేళాలో తమ ఫ్యామిలీ మెంబర్స్ తప్పిపోవడమే.
కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి వెళ్లి దాదాపు 1000 మందికి పైగా తప్పిపోయారట. ఇందులో 869 కుటుంబాలు ఇప్పటికీ తమ కుటుంబ సభ్యుల కోసం నిరీక్షిస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ల ఆచూకీ లభ్యం లేదు.. దీంతో తమ వారు ఎటు వెళ్లారు.. ఎటుపోయారు.. ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారని వారు ఆందోళన చెందుతున్నారు. అందులో కొన్ని ఫ్యామిలీస్ మీడియాతో మాట్లాడుతూ.. ఆవేదనకు గురయ్యాయి.
Also Read :- లలిత్ మోదీకి బిగ్ షాక్.. వనాటు పౌరసత్వం రద్దు
కుంభమేళాలో గైర్సా మాలి అనే వ్యక్తి తప్పిపోవడంతో అతని కుమారుడు ధన్వేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇప్పటికీ మా నాన్న ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నామన్నాడు ధన్వేష్. ‘కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రైన్లో వచ్చాం. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో జరిగిన తోపులాటలో తన తండ్రి అదృశ్యమయ్యాడు. మా నాన్న తప్పిపోయినప్పటి నుండి మేము ప్రయాగ్‌రాజ్‌ను వదిలి వెళ్ళలేదు. ఇక్కడే మా నాన్న కోసం వెతుకుతున్నాం. కుంభమేళా జరిగిన ప్రాంతంలో మా నాన్న ఆచూకీ తెలిసిన వారు చెప్పాలని పోస్టర్లు కూడా అంటించాం. కుంభమేళాకు వచ్చే ముందు చివరి సారిగా మా నాన్న గొంతు విన్నా’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు ధన్వేష్
బీహార్‌కు చెందిన 45 ఏళ్ల ప్రీతి కిషోర్ అనే మహిళ ఫిబ్రవరి 20న తన భర్త డాక్టర్ నీరజ్ పంకజ్‌తో కలిసి కుంభమేళాకు వెళ్లింది. జనసమూహంలో ప్రీతి తప్పిపోయింది. దీంతో తన భార్య కోసం ప్రతిచోట వెతికానని డాక్టర్ పంకజ్ తెలిపాడు. ‘‘కుంభమేళాలో తప్పిపోయిన చాలా మంది వ్యక్తులు చిత్రకూట్‌లో చేరారని ఎవరో నాకు చెప్పారు. దీంతో.. నేను కూడా అక్కడికి వెళ్ళాను. కానీ ఇప్పటికీ నా భార్య జాడ లేదు దొరకలేదు. ఇప్పటికీ ఆమె కోసం వెతుకుతూనే ఉన్నా’’ అని దీనంగా చెప్పాడు డాక్టర్ నీరజ్.
అజయ్ పాండే అనే 60 ఏళ్ల వ్యక్తి కుంభమేళా పుణ్య స్నానం ఆచరించి ఫిబ్రవరి 16న తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి నైని రైల్వే స్టేషన్‌కు వెళ్లిన పాండే.. స్టేషన్లో జరిగిన తోపులాటలో తప్పిపోయాడు. దీంతో అజయ్ పాండే కోసం అతడి కుటుంబ సభ్యులు ఇంకా వెతుకుతున్నారు. సహయం కోసం అధికారులను వేడుకుంటున్నారు. ఇలా కుంభమేళాలో ఎన్నో విషాదకర ఘటనలు జరిగగా.. కొన్నే వెలుగులోకి వచ్చాయి. ఇంకా బయటపడనివి చాలా ఉన్నట్లు తెలుస్తోంది.