యూపీ బోణీ.. 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌పై గెలుపు

యూపీ బోణీ.. 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌పై గెలుపు
  •     చెలరేగిన కిరణ్‌‌, హీలీ, హారిస్‌‌
  •     మాథ్యూస్‌‌ హాఫ్‌‌ సెంచరీ వృథా

బెంగళూరు: వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో ఓడిన యూపీ వారియర్స్‌‌.. విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌)లో ఎట్టకేలకు బోణీ చేసింది. ఛేజింగ్‌‌లో  కిరణ్‌‌ నవ్‌‌గిరె (31 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 57) హాఫ్‌‌ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం జరిగిన మూడో లీగ్‌‌ మ్యాచ్‌‌లో యూపీ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 161/6 స్కోరు చేసింది. హేలీ మాథ్యూస్‌‌ (47 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 55) రాణించింది. తర్వాత యూపీ 16.3 ఓవర్లలో 163/3 స్కోరు చేసి గెలిచింది. కిరణ్‌‌కు తోడు గ్రేసీ హారిస్‌‌ (38), అలీసా హీలీ (33) చెలరేగారు. కిరణ్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

మాథ్యూస్‌‌ ఫిఫ్టీ

ముంబై ఓపెనర్లు మాథ్యూస్‌‌, యాస్తికా భాటియా (26) ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌‌కు 50 రన్స్‌‌ జోడించారు. 8వ ఓవర్‌‌లో భాటియా ఔటైనా, బ్రంట్‌‌ (19) ఉన్నంతసేపు వేగంగా ఆడింది. దీంతో పవర్‌‌ప్లేలో 36 రన్స్‌‌ చేసిన ముంబై ఫస్ట్‌‌ టెన్‌‌లో 71/1తో మంచి స్థితిలో నిలిచింది. 13వ ఓవర్‌‌లో బ్రంట్‌‌ రనౌట్‌‌ కావడంతో యూపీ బౌలర్లు పైచేయి సాధించారు. 44 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టిన మాథ్యూస్‌‌ను 15వ ఓవర్‌‌లో గైక్వాడ్‌‌ ఔట్‌‌ చేసింది. 13 రన్స్‌‌ తేడాతో 2 వికెట్లు పడటంతో ముంబై 105/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో అమెలియా కెర్ర్ (23), పూజా వస్త్రాకర్‌‌ (18) వేగంగా ఆడారు. నాలుగో వికెట్‌‌కు 29 రన్స్‌‌ జత చేశారు. చివర్లో ఇసీ వాంగ్‌‌ (15 నాటౌట్‌‌) చెలరేగడంతో ముంబై మంచి టార్గెట్‌‌ను నిర్దేశించింది.  

కిరణ్‌‌ జోరు.. 

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓపెనర్లు హీలీ, కిరణ్‌‌ ముంబై బౌలింగ్‌‌ను ఉతికేశారు. బ్రంట్, సైకా ఇషాకి, మాథ్యూస్‌‌ని టార్గెట్‌‌ చేస్తూ కిరణ్‌‌ భారీ సిక్సర్లతో రెచ్చిపోయింది. రెండో ఎండ్‌‌లో హీలీ వరుసగా బౌండ్రీలు బాదడంతో పవర్‌‌ప్లేలో యూపీ 61/0 స్కోరుతో దూసుకుపోయింది. ఫీల్డింగ్‌‌ విస్తరించిన తర్వాత కూడా కిరణ్‌‌ సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో రన్‌‌రేట్‌‌ తగ్గకుండా చూసింది. అయితే 10వ ఓవర్‌‌లో కెర్ర్ బౌలింగ్‌‌కు దిగడంతో పరిస్థితి మారింది. 

అప్పటికే మంచి జోరుమీదున్న కిరణ్‌‌.. కెర్ర్ బౌలింగ్‌‌లో ఓ భారీ షాట్‌‌కు ట్రై చేసి ఔటైంది. దీంతో తొలి వికెట్‌‌కు 94 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి ముంబై బౌలర్లు కాస్త పట్టు బిగించారు. 11వ ఓవర్‌‌లో ఇసీ వాంగ్‌‌ (2/30) డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చింది. మూడు బాల్స్‌‌ తేడాలో తహ్లియా మెక్‌‌గ్రాత్‌‌ (1), హీలీని ఔట్‌‌ చేసింది. దీంతో 4 రన్స్‌‌ తేడాతో మూడు వికెట్లు పడటంతో యూపీ 98/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో గ్రేసీ, దీప్తి శర్మ (27 నాటౌట్‌‌) నిలకడగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లకు చాన్స్‌‌ ఇవ్వకుండా వీలైనప్పుడల్లా బౌండ్రీలతో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌కు 36 బాల్స్‌‌లోనే 65 రన్స్‌‌ జోడించి ఈజీగా విజయాన్ని అందించారు. 

 సంక్షిప్త స్కోర్లు


ముంబై: 20 ఓవర్లలో 161/6 (హేలీ మాథ్యూస్‌‌ 55, యాస్తికా 26, గ్రేసి హారిస్‌‌ 1/20). యూపీ: 16.3 ఓవర్లలో 163/3 (కిరణ్‌‌ 57, హారిస్‌‌ 38, వాంగ్‌‌ 2/30).