అమితంగా ఇష్టపడేవారు చనిపోతే ఆ బాధ వర్ణించడం కష్టం..అల్లారు ముద్దుగా కళ్లముందు పెరిగిన చెల్లెలు.. ప్రమాదానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఆమె ఆస్పత్రిలో చనిపోయింది. ఆస్పత్రి దద్దరిల్లేలా అతని రోదనలు.. ఓ పక్క అకస్మాత్తుగా చెల్లిని కోల్పోయి గుండె పగిలేలా ఏడుస్తున్న అన్నకు మరో బాధ వచ్చిపడింది..కనీసం చెల్లి మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో అంబులెన్స్ లేకపోవడం..అతని బాధను మరింత పెంచాయి. ఉబికి వస్తున్న కన్నీళ్ల ను తుడుచుకుంటూ.. చెల్లి డెడ్ బాడీని బైక్ తీసుకెళ్తున్న ఓ అన్న విషాదకర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
ఉత్తరప్రదేశ్ లోని ఔరయాలోని బిధునా కమ్యూనిటీ హెల్త సెంటర్లో బుధవారం (నవంబర్ 8) ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన సోదరి మృతదేహాన్ని బైక్ పై ఉంచుతూ బాధతో విలపిస్తున్నాడు. నీళ్లు వేడి చేసుకునేందుకు హీటర్ పెట్టిన ఓ యువతి ప్రమాదవ శాత్తు విద్యుత్ ఘాతానికి గురయింది. ఆ యువతిని వెంటనే బిధువా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా.. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.. అయినప్పటికీ ఆ యువతి సోదరుడు మాత్రం ఆశ కోల్పోలేదు.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆస్పత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో.. చనిపోయిన చెల్లెలి మృతదేహాన్ని మరో ఆస్పత్రికి తరలించేందుకు బైక్ పై తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.. ఈ సమయంలో ఆ యువకుడి రోదనలు చూసేవారిని కన్నీళ్లు పెట్టించాయి.
ఉత్తర్ ప్రదేశ్ లో ఆరోగ్య వ్యవస్థ అధ్వాన్నం గా ఉందని తెలిపే సాక్ష్యం ఈ వీడియో. ప్రజలు తమ చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న బంధువులను బైక్ లపై లేదా కూరగాయల బండ్లపై తీసుకెళ్తున్న సంఘటన లు చాలానే వెలుగు చూశాయి. యూపీలో అంబెలెన్స్ ల సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి అంటూ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత ఒకరు షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.