లక్నో: భర్త నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కర్వా చౌత్ పండుగనాడు ఉపవాసంతో పూజలు చేసిన భార్య.. దీక్ష విరమిస్తూ భోజనంలో విషం పెట్టి భర్తను చంపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబి జిల్లాలో ఆదివారం ఈ దారుణం జరిగింది. శైలేష్ కుమార్(32) అతడి భార్య సవిత ఆదివారం కర్వాచౌత్ ఆచరించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పూజలు నిర్వహించారు.
సాయంత్రం ఉపవాస దీక్ష విరమించే సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే విషయంపై భార్య గొడవ చేసింది. కాసేపట్లో గొడవ సద్దుమణగడంతో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే, భర్త తినే అన్నంలో సవిత విషం కలిపింది. భోజనం ముగిశాక ఏదో పనిచెప్పి భర్తను పక్కింటికి పంపింది. అతడు బయటికి వెళ్లగానే సవిత పరారైంది.
కొద్దిసేపట్లోనే శైలేష్‌కుమార్ అస్వస్థతకు గురికావడంతో ఆయన సోదరుడు ఆస్పత్రికి తరలించాడు. విషం కలిపిన ఫుడ్ తిన్నట్లుగా తేలింది. తన భార్యే విషం కలిపి పెట్టిందని శైలేష్ వీడియో రికార్డ్ చేశాడు. ఆపై కొద్దిసేపట్లోనే మృతిచెందాడు. శైలేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సవితను అరెస్ట్ చేశారు.