డబుల్‌ ఇన్నింగ్స్‌ ఆడిన UPA

2004లో కాంగ్రెస్​ పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. యునైటెడ్​ ప్రోగ్రెసివ్​ అలయెన్స్​ (యూపీఏ)ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ పదేళ్లు అధికారంలో కొనసాగించింది. ఇండిపెండెన్స్​ తర్వాత తొలిసారి కేంద్రంలో వరుసగా ఎనిమిదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ.. 2004లో ఫీనిక్స్‌‌లా పైకి లేచింది. అప్పటి జనరల్​ ఎలక్షన్​లో 145 సీట్లు సాధించి సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరించింది.  బీజేపీ 138 సీట్ల వద్దే ఆగిపోగా ఆ పార్టీ నాయకత్వంలోని అధికార ఎన్​డీఏకి దేశవ్యాప్తంగా 181 స్థానాలే దక్కాయి. దీంతో ఆ  కూటమి మేజిక్​ ఫిగర్ ​(272)కి చాలా దూరంలో నిలిచిపోయింది.

లెఫ్ట్​ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు

ఈ పరిస్థితుల్లో గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ​ హైకమాండ్​ సోనియాగాంధీ చక్రం తిప్పారు. పదికి పైగా లెఫ్ట్, సెంట్రిక్‌‌ లెఫ్ట్​ పొలిటికల్​ పార్టీలతో యూపీఏని తెరపైకి తెచ్చారు. ఈ కూటమి బలం 218కి చేరింది. మినిమం మెజారిటీకి ఇంకా 50కి పైగా సీట్లు కావాల్సి ఉండటంతో 59 మంది ఎంపీలు ఉన్న లెఫ్ట్​ ఫ్రంట్​ మద్దతివ్వడానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతి అబ్దుల్​ కలాంను కాంగ్రెస్‌‌ కోరింది. ఆయన ఓకే అంటే సోనియాగాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమని అందరూ భావించారు.

కానీ.. విదేశీ మూలాలున్న వ్యక్తి ఆ పదవి చేపట్టకూడదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి అబ్దుల్​ కలాం కూడా తనను కలిసిన కాంగ్రెస్​ పార్టీ నేతలతో అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో నొచ్చుకున్న యూపీఏ చైర్​ పర్సన్​ సోనియాగాంధీ అనూహ్యంగా సైలెంట్​ పర్సన్​ మన్మోహన్​సింగ్​ని ప్రధానిగా ప్రతిపాదించారు. భాగస్వామ్య పక్షాలన్నీ ఒప్పుకోవటంతో ఆయన సారథ్యంలో యూపీఏ సర్కారు కొలువు దీరింది.  మన్మోహన్​సింగ్​​ మంత్రివర్గంలో టీఆర్​ఎస్​ చీఫ్​, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్​ సభ్యుడిగా చేరడం గమనార్హం.

యూపీఏ తొలిసారి అధికారంలోకి రావటంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండియాకి ఇండిపెండెన్స్​ వచ్చాక జాతీయ రాజకీయాల్లో 30 ఏళ్ల పాటు కాంగ్రెస్​ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన లెఫ్ట్​ పార్టీలు… బీజేపీని దూరం పెట్టాలన్న ఏకైక కారణంతో కాంగ్రెస్‌‌ లీడర్​షిప్‌‌ని ఒప్పుకుంది. మన్మోహన్‌‌ (యూపీఏ) సర్కారుకి బయటి నుంచి సపోర్ట్​ చేశాయి. విదేశీ వనిత అనే సాకుతో  సోనియా గాంధీతో విభేదించి, ఎన్​సీపీ పేరిట వేరు కుంపటి పెట్టుకున్న శరద్​పవార్​ మళ్లీ ఆమె వెంటే నడిచారు. ఇలా దేశంలో రెండు సార్లు (యూపీఏ–1, 2) కొయిలేషన్​ గవర్నమెంట్లను కాంగ్రెస్​ పార్టీ ముందుండి నడిపింది.

పదేళ్లలో ఎన్నో అప్‌‌ అండ్‌‌ డౌన్స్‌‌

2004 నుంచి 2014 వరకు వరుసగా పదేళ్లు పవర్​లో కొనసాగింది. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను తట్టుకొని నిలబడింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తులు పెట్టుకునే పార్టీలు తమ బలాన్ని బట్టి డిమాండ్లు పెడతాయి. ఒక్కోసారి స్థాయికి మించి గొంతెమ్మ కోర్కెలు కోరతాయి. యూపీఏ​ సర్కారు ఏర్పడిన కొత్తలో కరుణానిధి పార్టీ డీఎంకే తాను కోరిన మంత్రి పదవులు ఇవ్వలేదనే కోపంతో సపోర్ట్​  విత్​డ్రా చేసుకుంటానని బెదిరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం అడుగులు వేయట్లేదన్న అసంతృప్తితో కేసీఆర్‌‌ కేబినెట్‌‌కి రాజీనామా చేసేశారు. టీఆర్​ఎస్ 2006లో యూపీఏ నుంచి బయటకు వెళ్లిపోయింది.

ఆ తర్వాత రెండేళ్లకు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ హ్యాండిచ్చింది. 2008లో ఇండియా–అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం వల్ల తలెత్తిన తీవ్ర విభేదాల నేపథ్యంలో లెఫ్ట్​ పార్టీలు యూపీఏకి మద్దతు వెనక్కి తీసుకున్నాయి. దీంతో మన్మోహన్​సింగ్​ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో యూపీఏ చైర్​పర్సన్​ సోనియా గాంధీ చాకచక్యంగా వ్యవహరించారు. ములాయం సింగ్​ నాయకత్వంలోని సమాజ్‌‌వాది పార్టీ (ఎస్పీ) సహా ఇతర పార్టీల అండతో విశ్వాస పరీక్షలో సర్కార్​ను గట్టెక్కించారు. ఈ కాన్ఫిడెన్స్‌‌ మోషన్‌‌కి తెలుగు దేశం పార్టీకి చెందిన మంద జగన్నాథం, డి.కె.ఆదికేశవులు నాయుడుకూడా అనుకూల ఓటు వేసేలా ఏపీ నుంచి అప్పటి సీఎం వై.ఎస్‌‌.రాజశేఖరరెడ్డి చక్రం తిప్పారు.

లోక్​సభలో యూపీఏని బల పరీక్షలో ఓడించేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడలేవీ ఫలించలేదు. తమ ఓట్లు కొనడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో లోక్‌‌సభలోనే నోట్ల కట్టలున్న బ్యాగ్‌‌లను ప్రదర్శించింది.. అయినప్పటికీ, యూపీఏ–1 గవర్నమెంట్ ‘అప్​ అండ్​ డౌన్స్’ తట్టుకుని ఐదేళ్ల ఫుల్​ టర్మ్​ను పూర్తి చేసింది. బలమైన నాయకత్వం ఉంటే సంకీర్ణ ప్రభుత్వమైనా సుస్థిర పాలన అందిస్తుందని యూపీఏ నిరూపించింది.

యూపీఏ సర్కారు ఐదేళ్లపాటు నమ్మకాన్ని నిలబెట్టుకోవటంతో తర్వాతి​ ఎలక్షన్​లో జనం మళ్లీ ఆ కూటమికే పట్టం కట్టారు.  యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ రెండోసారికూడా ప్రధానిగా మన్మోహన్ ​సింగ్​కే ఓటేశారు.

అడ్డుపడ్డరు

ఒక ప్రధాని(ఇందిరా గాంధీ)కి కోడలు, మరో ప్రధాని(రాజీవ్ ​గాంధీ)కి భార్య అయిన సోనియాగాంధీ ఆ వారసత్వంతో ప్రధాని కాలేకపోయారు. సోనియా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టలేకపోయారనటం కరెక్ట్​ కాదు. ఆమె ఆ పదవిని అలంకరించకుండా నైతికంగా అడ్డుకున్నారనటం సబబేమో. ఈ పని చేసింది మరెవరో కాదు. కాంగ్రెస్​ నాయకులే. వాళ్ల పేర్లు.. శరద్​ పవార్​, పీఏ సంగ్మా, తారిఖ్​ అన్వర్​. 1999లో 12వ లోక్​సభను రద్దు చేయటంతో  మధ్యంతర ఎన్నికలు జరపాల్సి వచ్చింది.

ఆ సమయంలో ఈ త్రిమూర్తులు కొత్త వివాదానికి తెర లేపారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఇండియా మూలాలు కలిగిన (నేటివ్‌‌ బోర్న్‌‌) వ్యక్తినే ప్రతిపాదించాలని డిమాండ్‌‌ చేశారు. తద్వారా సోనియా గాంధీ మన దేశీయురాలు కాదని, ఇటాలియన్​ అని పరోక్షంగా ప్రస్తావించారు. 1997లో కాంగ్రెస్​ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సోనియా గాంధీ తర్వాతి ఏడాది  పార్టీ ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యారు. 2004లో యూపీఏ అధికారంలోకి వస్తుందని స్పష్టం కావటంతో ఆమె ఇక ప్రధాని కావటమే తరువాయి అని అంతా భావించారు.

కానీ.. శరద్​ పవార్​, పీఏ సంగ్మా, తారిఖ్​ అన్వర్​లు మొదటిసారి లేవనెత్తిన విదేశీయత అనే అంశం ఆమె ప్రధాని కాకుండా అడ్డుపడింది. ఇండియా మూలాలు లేని వ్యక్తులు ప్రధాని కావడానికి వీల్లేదంటూ బీజేపీ మొండిగా  పట్టుబట్టింది. అదే మాటను రాష్ట్రపతి కలాంతో చెప్పించడంతో సోనియా మనసు విరిగిపోయింది. తన తరఫున మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్‌‌ సింగ్‌‌ని ప్రతిపాదించారు. ఇక్కడ గమ్మత్తేమిటంటే… ఆమెతో విభేదించి నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ)ని స్థాపించిన శరద్ ​పవార్​, తారిఖ్‌‌ అన్వర్‌‌లు..  ఆ తర్వాత యూపీఏ కూటమిలో చేరి కేంద్ర మంత్రులు కూడా అయ్యారు.

మౌన ముని

మన్మోహన్ సింగ్ పేరు వినగానే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన మౌనం. పదేళ్ల పాటు ప్రధాని పదవిలో ఉన్నా పెదవి విప్పకుండా కాలం గడిపారాయన. మన్మోహన్ పూర్తిగా మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు డిస్కవరీ. 1991లో దేశానికొక దిశా నిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో ఆర్థికవేత్త, ఆర్‌‌బీఐ మాజీ గవర్నర్‌‌ మన్మోహన్ సింగ్‌‌ని పీవీ ఏరి కోరి ఫైనాన్స్ మినిస్టర్‌‌గా చేశారు. పీవీ, మన్మోహన్ జంట దేశంలో ఆర్థిక సంస్కరణలను పరుగులు తీయించింది. మన్మోహన్ ఏ రోజూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. ఎకానమిస్టుగా లెక్కల్లో మునిగి తేలేవారు. అలాంటి వ్యక్తి పాలిటిక్స్‌‌లోకి రావడం, ఫైనాన్స్ మినిస్టర్ కావడం, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావడం అంతా యాక్సిడెంటల్‌‌గానే జరిగిపోయాయి. ఇండియా వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా రెండు టర్మ్‌‌లు ప్రధానిగా కొనసాగారు. కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలు, నిజాయితీపరుడన్న ప్రశంసలు, పెదవి విప్పి మాట్లాడడన్న విమర్శలు…. మన్మోహన్ జీవితంలో అన్నీ కలగలుపుగా ఉన్నాయి. 2004 నాటి యూపీఏ–1 సంకీర్ణ ప్రభుత్వానికి సారథిగా ఎంతో నేర్పుతో వ్యవహరించారు. ఒకవైపు లెఫ్ట్ పార్టీల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే మరో వైపు ఆర్థిక సంస్కరణలను కొనసాగించారు. అమెరికాతో  సివిల్‌‌ న్యూక్లియర్ డీల్ విషయంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మద్దతు ఉపసంహరిస్తామని లెఫ్ట్ పార్టీలు బెదిరించినా మన్మోహన్ బెదరలేదు. పట్టుదలతో ముందుకెళ్లి అగ్రరాజ్యంతో  డీల్ కుదుర్చుకున్నారు. లోక్‌‌సభలో విశ్వాస తీర్మానం నెగ్గారు.

రాజ్యసభ నుంచే రాజకీయం

యూపీఏ–1 ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపినప్పటికీ యూపీఏ 2లో మన్మోహన్ ఖాతాలో ఎక్కువగా మైనస్ పాయింట్లే నమోదయ్యాయి. ఒక్కొక్కటిగా బయటపడ్డ కుంభకోణాల్లో ఆయనకు ప్రమేయం లేకపోయినా సోనియా చేతిలో కీలుబొమ్మ అనే విమర్శ మూటకట్టుకున్నారు. ఎన్ని అపనిందలు వచ్చినా ఆయన మౌనంగానే భరించారు.  నిజాయితీ ఆయన ప్లస్ పాయింట్ మౌనం ఆయన మైనస్ పాయింట్. దేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా 15 ఏళ్లపాటు సేవలందించినా ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. 1991 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  దటీజ్ మౌన ముని మన్మోహన్ సింగ్.

తెలంగాణ ఇచ్చింది

చివర్లో… తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను తీర్చింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్​లో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని తెలిసికూడా తెగించింది. 2014 తర్వాత వరుసగా ఎన్నో ఓటములను ఎదుర్కొంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్‌‌లో మళ్లీ పుంజుకుంది. ఆ ఉత్సాహంతోనే 2018 ఆఖర్లో బీజేపీ చేతి నుంచి ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్‌‌లలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కర్ణాటకలో కుమార స్వామిని గద్దెనెక్కించటంలో సక్సెస్​ అయింది. యువ నేత రాహుల్​గాంధీ నాయకత్వంలో మరో వారం పది రోజుల్లో యూపీఏ–3 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు అంటున్నారు.