టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సౌతాఫ్రికా లాంటి బౌన్సీ పిచ్ లపై తన స్పిన్ మాయాజాలాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్ లు జరిగితే ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పిన ఈ మిస్టరీ స్పిన్నర్.. రెండో టీ20లో 5 వికెట్లు పడగొట్టి సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. రెండు మ్యాచ్ ల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వరుణ్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారీగా దూసుకొచ్చాడు.
ఏకంగా 110 స్థానాలు ఎగబాకి 66 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు 176 వ స్థానంలో ఉన్నాడు. ఇతర భారత బౌలర్ల విషయానికి వస్తే రవి బిష్ణోయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 7 స్థానంలో ఉన్నాడు. అర్షదీప్ 12 స్థానంలో ఉండగా.. అక్షర్ పటేల్ 23 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టీ20 క్రిక్ట్ కు దూరంగా ఉన్న కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వరుసగా 25, 29 స్థానాల్లో నిలిచారు.
బ్యాటింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ సాల్ట్ రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు. కొద్దికాలంగా టీ20 క్రికెట్ ఆడకపోయినా జైశ్వాల్ 7 స్థానంలో ఉన్నాడు. టీమ్స్ విషయంలో భారత్ అగ్ర స్థానంలోనే ఉంది.