కరెంటు కష్టాలకు చెక్​ పెట్టేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్స్​

కరెంటు కష్టాలకు చెక్​ పెట్టేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్స్​
  • మొబైల్​ ఫోన్లకు తెలుగులో స్టేటస్​ రిపోర్ట్​
  • కొత్త దరఖాస్తుదారులకు ప్రతీ దశలో సమాచారం 
  • సమస్యల పరిష్కారానికి 1912 టోల్​ ఫ్రీ నంబర్​ 

జనగామ, వెలుగు : రైతులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు టీజీ​ఎన్​పీడీసీఎల్​ సరికొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది. ఇప్పటికే టీజీఎన్​పీడీసీఎల్​ యాప్​తో పలు సేవలను అందుబాటులోకి తేగా, తాజాగా కొత్త విద్యుత్​ సర్వీసులకు దరఖాస్తు చేసుకునేవారికి స్టేటస్​ రిపోర్ట్​ను ఎప్పటికప్పుడు మొబైల్​ ఫోన్లకు పంపిస్తోంది. మంజూరుకు సంబంధించిన ప్రతి దశలోనూ తెలుగులో అప్డేట్ మెసేజ్​ చేస్తూ సమస్యలకు చెక్​ పెడుతున్నారు.

అప్డేట్ ​రిపోర్ట్..​

టీజీ ఎన్​పీడీఎసీఎల్ గృహ వినియోగదారులు, వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్ల జారీలో పారదర్శకత తీసుకువస్తోంది. దరఖాస్తుదాలకు అవగాహన కలిగించి సకాలంలో కొత్త కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకుంటోంది. అగ్రికల్చర్​ కనెక్షన్లకు గతంలో రైతులు అప్లై చేస్తే కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ఇప్పుడా పరిస్థితి లేకుండా సంస్కరణలు తెచ్చారు. మీసేవలో అప్లై చేసుకున్నప్పటి నుంచి సర్వీస్​ ఆర్డర్​రిలీజ్​ అయ్యే వరకూ ప్రతి దశలోనూ మొబైల్​ నంబర్​కు అప్డేట్​ మెసేజ్​లను తెలుగులో పంపిస్తున్నారు. 

ఈ మెసేజ్ లో లింక్​ కూడా పంపిస్తుండడంతో దానిని ఓపెన్​ చేస్తే స్టేటస్​ రిపోర్ట్​ మొత్తం తెలిసేలా ఏర్పాట్లు చేశారు. తొలుత రైతు కొత్త సర్వీస్​ కనెక్షన్​ కోసం తన ఆధార్​కార్డు, ఫొటో, ఆర్ఐ జారీ చేసిన సీ ఫాం, పాస్​బుక్​ జిరాక్స్​కాపీలతో మీసేవలో 5 హెచ్​పీ కోసం రూ.5,250, 7.5 హెచ్​పీకి రూ 8,250లు చెల్లించి అప్లై చేస్తే సదరు ఫాం విద్యుత్​ శాఖ యాప్​లోకి వస్తుంది. దీనిపై లైన్​మెన్​ లేదా లైన్​ ఇన్​స్పెక్టర్లు ఫీల్డ్​విజిట్​ చేసి ప్లాన్​వేస్తారు. ఆ తర్వాత ఏఈ ఉన్నతాధికారులకు ప్రపోజల్స్​పంపి మంజూరు చేయిస్తారు. కాగా, మీ సేవలో అప్లై చేసిన టైంలో అప్లికెంట్​రిజిస్టర్డ్​ సెల్​కు మెసేజ్​ వస్తుంది. 

ఆ తర్వాత ఎస్టిమేషన్​ పూర్తికి సంబంధించిన మెసేజ్​వస్తుంది. కాగా, ఒక డీడీ తీస్తే రెండు కరెంట్​పోల్స్​తోపాటు ఒక సపోర్టింగ్​పోల్​ను ఇస్తారు. ఇక్కడ దరఖాస్తుదారు చెల్లించిన డీడీ ఆధారంగా లైన్​మెన్​ ఫీల్డ్​ విజిట్​చేసి రెండు కంటే ఎక్కువ పోల్స్​అవసరముంటే దానిని తన పై అధికారులకు నివేదిస్తారు. అదనపు పోల్స్​అవసరమైతే ఒక పోల్​కు మెటీరియల్​కాస్ట్​తో కలిపి సుమారుగా రూ.15 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇలా ఎన్ని పోల్స్ అవసరమైతే అన్నింటికి లెక్కకట్టి సదరు రైతుకు మెసేజ్ పంపుతారు. దీంతో రైతులు డీడీ తీస్తే తదుపరి వర్క్​ ఆర్డర్​ వస్తుంది. ఈ దశలోనూ వివరాలతో మెసేజ్​చేస్తారు. అనంతరం మెటీరియల్​ డ్రా, వర్క్​కంప్లీట్.. ఆ తర్వాత సర్వీస్​ కనెక్షన్​రిలీజ్​ చేసి మెసేజ్​లను పంపిస్తారు.​​ 

ఇలా ప్రతి దశలో మెసేజ్​లు, టీజీఎన్​పీడీసీఎల్​కు చెందిన వెబ్​ లింక్​ కూడా పంపిస్తుండడంతో ఇక్కట్లు తొలిగిపోతున్నాయి. రైతుల నుంచి ఏమైనా డాక్యుమెంట్స్​తక్కువ జత చేసి ఉంటే వాటిని తెప్పించి ఫైల్​ను తదుపరి దశకు తీసుకెళ్తున్నారు. అనుమానాల నివృత్తి, ఫిర్యాదులకు 1912 టోల్​ ఫ్రీ నంబర్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు.  

స్పీడ్​గా కొత్త కనెక్షన్లు..

జనగామ జిల్లా పరిధిలో కొత్త కనెక్షన్లను స్పీడ్​గా అందిస్తున్నారు. ప్రతి నెల 200ల నుంచి 300ల వరకు కొత్త సర్వీస్​ రిలీజ్​ఆర్డర్లు ఇస్తున్నట్లు విద్యుత్​ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 1031 మంది వ్యవసాయ బావుల కనెక్షన్ల కోసం అప్లై చేసుకున్నారు. వీరందరికీ పారదర్శకంగా సర్వీస్​లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరెంట్​పోల్స్, లైన్లు అవసరం లేకుంటే నెలలోపు సర్వీస్​ఆర్డర్​ రిలీజ్ చేసి నంబర్లను అలాట్​చేసేలా ముందుకు సాగుతున్నారు. 

పోల్స్, లైన్లు అవసరమైతే మూన్నెళ్లల్లో పని పూర్తి చేసి సర్వీస్​ నంబర్లు ఇస్తున్నారు. కాగా, పంట కోతల తదుపరి కరెంటు పనులకు అనుకూలంగా ఉండడంతో వేసవిలో ఊపందుకోనున్నాయి. 

దరఖాస్తుదారులకు నేరుగా మెసేజ్​లు

కొత్త విద్యుత్​ సర్వీస్​ల కోసం మీసేవలో అప్లై చేసిన రోజు నుంచి మంజూరు వరకు వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే దరఖాస్తుదారు మొబైల్ నంబర్​కు తెలుగులో మెసేజ్​వెళ్లేలా టీజీఎన్పీడీసీఎల్​ ప్రత్యేక సాఫ్ట్​వేర్​ రూపొందించింది. 

తద్వారా ఎస్టిమేషన్​ వివరాలు తెలుపడంతోపాటు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉన్నా, డాక్యుమెంట్లు తక్కువగా జత చేసినా సమాచారం ఇచ్చి పరిష్కారం చూపుతున్నాం. తద్వారా అప్లికేషన్ల రిజెక్ట్​ తగ్గింది. వెంటనే చర్యలు తీసుకుంటూ సకాలంలో కనెక్షన్లు అందిస్తున్నాం.

- టీ.వేణుమాధవ్, ఎస్ఈ, టీజీఎన్​పీడీసీఎల్, జనగామ