
భారతీయ రైల్వేకు సంబంధించి రెండు ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ), ఇండియన్ రైల్వే ఫైనాన్స్కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ)లకు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదాను ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ రూ.4,270.18 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించగా, ఐఆర్ఎఫ్సీ రూ.26,644 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నవరత్న హోదా కలిగిన 25వ కంపెనీగా ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ 26వ కంపెనీగా గుర్తింపు పొందాయి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు మినీరత్న, నవరత్న, మహారత్న పేరుతో మూడు రకాల హోదాలను కేంద్రం కేటాయిస్తుంటుంది. ఆర్థికంగా, నిర్వహణపరంగా నిర్ణీత స్థాయిని అందుకున్నాక ఆయా సంస్థలకు ఈ హోదాను కేంద్రం ఇస్తుంటుంది. ఈ హోదాను పొందిన సంస్థలు ఆర్థిక పెట్టుబడులు, ఇతర కీలక నిర్ణయాలను ప్రభుత్వ అనుమతి లేకుండా స్వతంత్రంగా తీసుకుంటాయి.
నవరత్న హోదా కలిగిన కంపెనీలు రూ.1000 కోట్ల వరకు లేదా వాటి మొత్తం నికర విలువలో 15 శాతం మేరకు ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇప్పటివరకు భారత్ ఎలక్ట్రానిక్స్, కంటెయినర్ కార్పొరేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఆయిల్ ఇండియా, వైజాగ్ స్టీల్ వంటి సంస్థలు నవరత్న హోదాను పొందాయి.