భారత్ లో డిజిటల్ చెల్లింపుల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానికి పెరుగుతున్న తాజా గణంకాలే సాక్ష్యం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రతి నెలా 60 లక్షల మంది కొత్త వినియోగదారులను ఆకర్షిస్తోంది. UPI లావాదేవీలలో రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా డేటా ప్రకారం జూన్ నెలలో UPI ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీల సంఖ్య సంవత్సరానికి 49 శాతం పెరిగి సొమ్ము విలువ 13.9 బిలియన్లకు చేరుకుంది. తాజా గణంకాల ప్రకారం రోజువారీ లావాదేవీల సంఖ్య 463 మిలియన్లు, లావాదేవీ విలువ 36 శాతం పెరిగి సొమ్ము విలువ రూ.20.1 బిలియన్లకు చేరుకుంది. అంటే సగటున రోజువారీగా దేశవ్యాప్తంగా 66,903 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి.
భారత్ UPI లావాదేవీలు ఇంతలా పెరగడానికి అనేక దేశాలలో యూపీఐ చెల్లింపులు సులభతరం చేయడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఉదాహరణకు UAE-లోని అల్ మాయా సూపర్‌మార్కెట్ తన అవుట్‌లెట్ అన్నింటిలో UPI ఆధారిత చెల్లింపులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, యువత, సాంకేతిక పరిజ్ఞానం, పెరుగుతున్న జనాభా అన్నీ కలిసి ఫిన్‌టెక్ రంగాన్ని కొత్త తీరాలకు తీసుకువెళ్తున్నాయి.
మూడేళ్ల క్రితం రూపే క్రెడిట్ కార్డుల మార్కెట్ వాటా కేవలం 1 శాతం నుంచి ఉంటే అది తాజాగా 10 శాతానికి పెరిగిందని NPCI చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ తెలిపారు. UPI లోకి నెలకు 3 నుంచి 6 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
మరోవైపు NPCI నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, డైరెక్టర్ అయిన అజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. UPI ఇప్పుడు పారిస్‌లోని ఈఫిల్ టవర్ దగ్గర అలాగే పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా హౌస్‌మాన్‌లోని గ్యాలరీస్ లఫాయెట్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లతో సహ మరిన్ని దేశాల్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రోజుకు 1 బిలియన్ యుపిఐ లావాదేవీలను సాధించాలని ఎన్‌పిసిఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Kearney India, Amazon Pay ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలోని చిన్న-పట్టణాలలో వినియోగదారులు చేసే లావాదేవీలు 65 శాతం ఇప్పుడు డిజిటల్‌గా ఉండగా.. పెద్ద నగరాల్లో అది 75 శాతంగా ఉంది. డిజిటల్ చెల్లింపులు ఈ స్థాయిలో జరగడానికి దేశంలోని అన్ని వయసుల వారు ప్రముఖపాత్ర పోషిస్తున్నట్లు.. యుక్త వయసు నుంచి వృద్ధుల వరకు ఈ వ్యవస్థ చేరినట్లు తెలుస్తోంది.